లాల్‌‌దర్వాజాలో ముదిరిన పోతురాజు పోటీ వివాదం.. పోసాని బంధువులపై దాడి

by  |
లాల్‌‌దర్వాజాలో ముదిరిన పోతురాజు పోటీ వివాదం.. పోసాని బంధువులపై దాడి
X

దిశ, చార్మినార్​: పాతబస్తీ లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళీ దేవాలయ పోతరాజు పోటీ విషయంలో రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. పోటీగా వచ్చిన రెండవ పోతరాజు కంటే వంశపారంపర్యంగా వచ్చిన ఆలయ పోతరాజు బృందం విన్యాసాలు హైలెట్​గా జరిగాయని, మరో వర్గానికి చెందిన కొంత మంది అర్థరాత్రి లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం ఎదురుగా పోలీసుల సాక్షిగా పోసాని పోతరాజు బంధువులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పోసాని కుటుంబ సభ్యుడు, లాల్​దర్వాజా ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు పీఆర్ ధర్మవీర్ ముదిరాజ్​ తలకు బలమైన గాయాలయ్యాయి. సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మవీర్ ​పరిస్థితి విషమంగా ఉంది. షాలిబండా పోలీస్ స్టేషన్​ పరిధిలో అర్థరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోసాని కుటుంబంపై దాడికి పాల్పడ్డ ముగ్గురు యువకులను షాలిబండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాలిబండా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోసాని కుటుంబానికు చెందిన లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయ కమిటీ ఉపాధ్యక్షుడు, మేకల్​బండకు చెందిన పీఆర్​ధర్మవీర్(35), హరీష్​, అభిషేక్, అర్జున్​లు మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో బైక్ లపై ఖిల్వత్​ తాజ్​ హోటల్​లో టీ తాగి, లాల్​దర్వాజా దేవాలయ ప్రాంగణంకు చేరుకుంటుండగా బైక్​లపై ఎదరుపడ్డ వంశీ, రాకేష్​, కృష్ణాయాదవ్​లతో పాటు మరి కొంతమంది అడ్డుకున్నారు.

పక్కనే పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఎందిరా నీ లొల్లి అని వంశీ, రాకేష్​లు గొడవకు దిగారు. ఇరువర్గాలు పరస్పరం దూషించుకున్నారు. ఇంతలోనే ధర్మవీర్​పై పిడిగుద్దులు గుద్దారు. ఒక్కసారిగా కింద పడి పోయిన ధర్మవీర్​ను రోడ్డుపై తలను బాదారు. అప్పటికే ధర్మవీర్ ​అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పక్కనే ఉన్న పోలీసులు రాడవంతో దాడికి పాల్పడ్డవారు పరారయ్యారు. తీవ్ర గాయాలైన ధర్మవీర్​ను చికిత్స నిమిత్తం సోమాజీగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్న ధర్మవీర్​ కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు చెబుతున్నారు. 48 గంటలు దాటితే కానీ పరిస్థితి చెప్పలేమని, మొత్తానికి పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. అభిషేక్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాలిబండా పోలీసులు కేసును నమోదు చేసుకుని దాడికి పాల్పడ్డ వంశీ యాదవ్​, రాకేష్​ యాదవ్​, కృష్ణాయాదవ్​లు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును షాలిబండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది…

తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాల ఉత్సవాలకు లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయం సుప్రసిద్ది. వాస్తవానికి లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళీ దేవాలయంలో మూడు కులాలకు చెందిన గౌడ్స్​, ముదిరాజ్, యాదవ్​కులాలతో పాటు ఇతర కులాల వారు కూడా అమ్మవారి సేవలో ఉంటూ నిరంతరం ఆలయ అభివృద్దికి పాటుపడుతున్నారు. మూడు కులాలకు సంబంధించిన వారు ఆలయ కమిటీలో ప్రతినిధులుగా ప్రస్తుతం కొనసాగతున్నారు.

స్థల వివాదము కారణమే..

మేకల్​బండలో 1000 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం ఓ యాదవ్​ భవన్​ నిర్మించడానికి మేకల్​బండకు చెందిన కొంతమంది ప్రయత్నిస్తుండగా మరో కులానికి చెందిన వారు అడ్డకుంటున్నారన్న నెపంతో ఇరు కులాల మధ్య వివాదం తలెత్తింది. వాస్తవానికి మేకల్​బండలోని ఆ ఖాళీ స్థలానికి లాల్​దర్వాజా చారిత్రాత్మక ఆలయంకు సంబంధమే లేదు. 2021 బోనాల సందర్భంగా నూతన కమిటీ నియామకం సమావేశాల నుంచే ఆ స్థలం గొడవ కాస్త ఆలయంలోకి లాగారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల సందర్భంగా లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయం అధ్యక్షుడుగా కె. వెంకటేష్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే లాల్ దర్వజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయం నుంచి భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర ఉమ్మడి దేవాలయాలు ఊరేగింపు కమిటీ అధ్యక్షుడుగా బల్వంత్​ యాదవ్​ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో జరిగిన బోనాల సమావేశాలలో ఆలయ బ్రోచర్లలో పేర్ల ప్రింటింగ్​ విషయంలో కూడా వివాదం తలెత్తుతూ వచ్చింది. కాగా వంశపారంపర్యంగా నిజాం కాలం నాటి నుంచి 113 ఏళ్లుగా లాల్​దర్వజా సింహవాహిని మహంకాళి దేవాలయ పోతరాజుగా పోసాని కుటుంబం సేవలో నిమగ్నమయింది. ఈ సారి పోసాని కుటుంబ పోతరాజు వద్దని కొత్త పోతరాజును తీసుకువస్తామని ఆలయ సమావేశాలలో ఒక వర్గం చర్చించుకున్నారు.

మేము కూడా ఖచ్చితంగా పోతరాజు వేస్తాం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని పోసాని కుటుంబం కూడా బహిరంగంగానే చెప్పింది. ఈ విషయమై మంత్రి తలసాని దృష్టికి కూడా పోసాని కుటుంబం తీసుకెళ్లింది. ఈ విషయంలో ఆలయ పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోటీగా వచ్చే పోతరాజును ఘటాల నిమజ్జనం రోజు ఉదయం 10గంట​లలోపే విన్యాసాలు ముగించుకోవాలని, ఆ తర్వాత ఆలయ పోతరాజుగా పోసాని కుటుంబం నుంచే అశ్విన్​ పోతరాజు వస్తాడని ఒప్పందమయ్యింది. ఈ విషయంలో దాదాపు 10 రోజుల పాటు వివాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య గొడవ జరుగవచ్చనే అభిప్రాయ పడ్డ దక్షిణ మండలం పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా మేకల్​బండలో భారీ బందోబస్తును చేపట్టారు. సోమవారం ఉదయం పోటీగా వచ్చిన ఆలయ పోతరాజు ఆలయ పురవీధులలో విన్యాసాలు చేస్తున్న తరుణంలో పోసాని కుటుంబం ఉన్న గల్లీలోకి పోతరాజు వెళ్తుండగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎట్టకేలకు అమ్మవారి ఘటాల నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా జరిగిందనుకుంటున్న నేపథ్యంలో అర్థరాత్రి జరిగిన దాడి సంచలనం సృష్టించింది.

స్థానికులకు ప్రాధాన్యం కల్పించం కోసమే..

లాల్​దర్వజా సింహవాహని మహంకాళీ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని 2015లో ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు మరి కొంతమంది కమిటీగా ఏర్పడి దేవాదాయశాఖకు విన్నవించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్ ​కూడా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంటేనే అభివృద్ది చెందుతుందని మద్దతు పలికారు. దీంతో మాజీ మంత్రి కృష్ణాయాదవ్​ జోక్యం చేసుకుని మంత్రి కేటీఆర్​, దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కరణ్​రెడ్డిలకు లాల్​దర్వాజా ఆలయంను దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవద్దని, ఇన్నేళ్లుగా అమ్మవారికి సేవ చేస్తున్న స్థానికుల ప్రాధాన్యత తగ్గుతుందన్న నేపథ్యంలో వ్యతిరేకించారు. దీంతో దేవాదాయ శాఖ ఆధీనంలోకి ఆలయ విషయం కాస్త పెండింగ్‌లో పడింది.



Next Story

Most Viewed