రాముడి పేరుతో బీజేపీ రాజకీయం : మంత్రి కొండా సురేఖ

by Disha Web Desk 15 |
రాముడి పేరుతో బీజేపీ రాజకీయం : మంత్రి కొండా సురేఖ
X

దిశ, దుబ్బాక : రాముడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తుందని, అది కలలో కూడా జరగదని ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు, దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివా సరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో మాయమాటలతో గెలిచిన రఘునందన్​రావు దుబ్బాకకు చేసిందేమీ లేదని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్క నిధులు కూడా తీసుకురాలేదన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ గెలవకున్నా చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక అభివృద్ధి కోసం రూ.40 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులను చేపట్టాడన్నారు. మాయ మాటలు చెప్పే నాయకులు కావాలో, అభివృద్ధి పనులు చేసే నాయకులు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఐదు న్యాయ సూత్రాలను అమలుచేసి తీరుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అమలు చేసి ఈ ఎన్నికల్లో ప్రజల వద్దకు గర్వంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని అడుగుతున్నామన్నారు. కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరుగుతుందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లను కూడా నిర్మించితీరుతామన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని, మిగులు బడ్జెజ్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. జైలులో ఉన్న కవితను విడుదల చేసుకునేందుకే కేసీఆర్, బీజేపీ వద్ద మోకరిల్లాడని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అంతర్గతంగా ఒప్పందం చేసుకొని ప్రజల్లో నాటకాలాడుతున్నాయన్నారు. బీజేపి పార్టీ నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదని, ధనికులైన అదానీ, అంబానీల కోసమే నరేంద్రమోడీ ప్రభుత్వం పని చేసిందన్నారు. బీఆర్ఎస్ కలలు కన్నట్టుగా కవిత జైల్లో నుంచి విడుదల కాదన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతమైందని, ఇప్పుడు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నాయకులను ప్రజలు పట్టించుకోవడమే లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదన్నారు. గతంలో మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీని గెలిపించిన ఘనత ఇక్కడి ప్రజలదని, ఇదే స్ఫూర్తితో బీసీ బిడ్డ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా కేంద్రం నుండి అధిక నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపరుస్తానన్నారు. నర్సాపూర్లో రాహుల్ గాంధీ సభ నిర్వహించడం జరుగుతుందని, ఆ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు కొంగరి రవి, మున్సిపల్ అధ్యక్షులు యేసురెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక అసెంబ్లీ సోషల్ మీడియా కోర్దినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, కాడురి నరేందర్ రెడ్డి,13 వ వార్డు ఇంచార్జీ తునికి సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story