బ్యాంకింగ్ మద్దతు.. మళ్లీ లాభాల్లోనే మార్కెట్లు

by  |
బ్యాంకింగ్ మద్దతు.. మళ్లీ లాభాల్లోనే మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారం మార్కెట్లు లాభాలను దక్కించుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం కూడా అదే జోరును కొనసాగించాయి. ఉదయం ప్రారంభం నుంచే మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధమవడంతో సూచీలు అధిక లాభాల్లో ర్యాలీ చేశాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ భారత్‌లో అంతమవుతుందనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత వంటి పరిణామాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి అధిక లాభాలను దక్కించుకున్నాయి.

ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం మద్దతు ఇవ్వడంతో సూచీలు సానుకూలంగా ర్యాలీ చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 448.62 పాయింట్లు ఎగసి 40,431 వద్ద ముగియగా, నిఫ్టీ 110.60 పాయింట్లు లాభపడి 11,873 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా బ్యాంకింగ్ రంగం 3 శాతానికి పైగా పుంజుకోగా, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు 1 శాతానికిపైగా బలపడ్డాయి. ఆటో, ఫార్మా, ఐటీ, మీడియా రంగాలు స్వల్పంగా బలహీనపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకి షేర్లు మాత్రమే డీలాపడగా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ఇండ్, కోటక్ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు అత్యధిక లాభాలతో ట్రేడయ్యాయి, హెచ్‌సీఎల్, ఎన్‌టీపీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.37 వద్ద ఉంది.

Next Story

Most Viewed