జోరు పెంచిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు

by  |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు జోరు పెంచాయి. గతవారం కరోనా భయాలతో భారీగా నష్టాలను ఎదుర్కొన్న సూచీలు అంతకంటే వేగంగా ఒక్కరోజులే అధిక లాభాలను సాధించాయి. ఉదయం ప్రారంభం నుంచి ట్రేడింగ్ జోరు పెంచిన స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్లు పెరగడమే దీనికి కారణమని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ వారం మార్కెట్లు తీవ్రంగా ఒత్తిడికి గురవుతాని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ మార్కెట్లు స్పందించాయి. ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) ఉపసంహరణకు తలొగ్గకపోవడం, దేశీయ మదుపర్ల నుంచి పెట్టుబడులు పెరగడంతో సూచీలకు కలిసొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, త్వరలో మార్చితో ముగిసే చివరి త్రైమాసిక ఫలితాలు కూడా మదుపర్లను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. చివరి త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉంటాయని, గతంతో పోలిస్తే కరోనా నుంచి బయటపడి ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా ఉండటం కూడా మంగళవారం నాటి ర్యాలీ కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,128.08 పాయింట్లు ఎగసి 50,136 వద్ద ముగియగా, నిఫ్టీ 337.80 పాయింట్లు ర్యాలీ చేసి 14,845 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ, మెటల్ రంగాలు లాభాలను మద్దతివ్వగా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలు 2-3 శాతం పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు మాత్రమే నష్టాలను చూడగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, టైటాన్, ఏషియన్ పెయింట్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.55 వద్ద ఉంది.



Next Story

Most Viewed