లాభాల స్వీకరణతో వెనక్కి తగ్గిన మార్కెట్లు!

by  |
లాభాల స్వీకరణతో వెనక్కి తగ్గిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్టాక్ మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కీలకమైన 50 వేల మార్కును తాకింది. గతేడాది కరోనా వ్యాప్తి కారణంగా అత్యంత కనిష్ఠంగా 25 వేల మార్కుకు పడిపోయిన తర్వాత కేవలం 10 నెలల కాలంలో పుంజుకున్న సూచీలు చరిత్రలోనే అతిపెద్ద మైలురాయిని చేరిన రోజుగా జనవరి 21వ తేదీ నమోదైంది. అయితే, చివరి గంటలో అనూహ్యంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు వెనక్కి తగ్గాయి.

ఉదయం ప్రారంభం సమయంలో కొనుగోళ్ల మద్దతుతో జీవిత కాల గరిష్ఠాలను తాకిన సూచీలు, చివర్లో లాభాల స్వీకరణతో నష్టాలను చూడక తప్పలేదు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకరంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడ్డం, మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అంచనాలతో మార్కెట్లు బలపడటంతో, ఆ ప్రభావం ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో 50 వేల మార్కును చేరుకున్న సూచీలు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. కానీ, చివర్లో ఇన్వెస్టర్లు లాభాలను తిరిగి తీసుకోవడంతో సూచీలు డీలాపడ్డాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 167.36 పాయింట్లు కోల్పోయి 49,624 వద్ద ముగియగా, నిఫ్టీ 54.35 పాయింట్లు నష్టపోయి 14,590 వద్ద ముగిసింది. నిఫ్టీలో అన్ని రంగాలు డీలాపడగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ, మెటల్ 2 శాతానికిపైగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, హిందూస్తాన్ యూనీలీవర్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.98 వద్ద ఉంది.

Next Story

Most Viewed