మళ్లీ లాభాలు నమోదు చేసిన సూచీలు

by  |
మళ్లీ లాభాలు నమోదు చేసిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో ఉదయం ప్రారంభ సమయంలో స్వల్పంగా నష్టాలను చూసినప్పటికీ మిడ్ సెషన్ తర్వాత లాభాలను దక్కించుకున్నాయి. గత రెండు సెషన్లలో మార్కెట్లు ర్యాలీ చేయడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధమయ్యారని, ఈ కారణంగానే సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయని మార్కెట్ నిపుణులు చెప్పారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడి వల్ల మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాలను కోల్పోయాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 112.77 పాయింట్లు ఎగిసి 40,544 వద్ద ముగియగా, నిఫ్టీ 23.75 పాయింట్ల లాభంతో 11,896 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా రియల్టీ 4 శాతం బలపడగా, మీడియా, ఆటో, ఐటీ రంగాల షేర్లు 2 శాతానికిపైగా పుంజుకున్నాయి.

ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ రంగాలు 1 శాతం వరకు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.47గా ఉంది.


Next Story

Most Viewed