55,000 మైలురాయిని దాటిన సెన్సెక్స్

by  |
55,000 మైలురాయిని దాటిన సెన్సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరుకు వరుస రికార్డుల పరంపర కొనసాగింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులకు మదుపర్లు సిద్ధపడటంతో శుక్రవారం ఉదయం నుంచే సూచీలు రికార్డు గరిష్ఠాలను ప్రారంభించాయి. దీనికి తోడు జూన్ నెలకు సంబంధించి తయారీ కార్యకలాపాలు పుంజుకోవడం, జూలై రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠానికి తగ్గిపోవడంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా బాంబె స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ బలమైన లాభాలతో దూసుకెళ్తోంది. ఈ నెల ప్రారంభం నుంచే రోజురోజుకు జీవితకాల గరిష్ఠాలను అధిగమిస్తూ ర్యాలీ చేసిన సెన్సెక్స్ శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో అదే దూకుడును కొనసాగించి 55,000 కీలక మైలురాయిని దాటేసింది. అక్కడితో ఆగకుండా అదే జోరులో 55,487 మార్కుతో జీవిత కాల గరిష్ఠాలను తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 593.31 పాయింట్లు ఎగసి 55,437 వద్ద ముగిసింది. నిఫ్టీ 164.70 పాయింట్లు పెరిగి 16,529 వద్ద క్లోజయింది. నిఫ్టీలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమార్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోళ్ల ధోరణి కనబడింది.

మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు అధిక లాభాలను సాధించగా, పవర్‌గ్రిడ్, డా రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.27 వద్ద ముగిసింది.

Next Story

Most Viewed