కరోనా ఎఫెక్ట్.. మందగించిన సచివాలయ నిర్మాణ పనులు.!

by  |
కరోనా ఎఫెక్ట్.. మందగించిన సచివాలయ నిర్మాణ పనులు.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి సచివాలయం నిర్మాణంపైనా పడింది. వెయ్యి మంది కార్మికులు రేయింబవళ్ళు పనిచేస్తుండగా ఇప్పుడు ఒక్క షిప్టు కూడా నడవడం కష్టమవుతోంది. ప్రస్తుతం 200 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. తోటి కార్మికులు కరోనా బారిన పడడంతో ఇప్పుడు పనిచేస్తున్నవారు కూడా భయం మధ్యనే పనులు చేస్తున్నారు. చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కావడంతో లాక్‌డౌన్ ఉంటుందన్న భయం, అనుమానంతో సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. ఏడాది లోగా పనులు పూర్తి చేసుకుని సచివాలయాన్ని వినియోగంలోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి బ్రేక్ పడింది.

రాష్ట్ర సచివాలయ పనులకు మొదటి నుంచీ రకరకాల ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. శంకుస్థాపన చేసింది మొదలు ఏదో ఒక రూపంలో విఘ్నాలు ఎదురవుతున్నాయి. వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో 2019, జూన్ 26న కొత్త సచివాలయం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. డిజైన్ రూపొందింది మొదలు మార్పులు, చేర్పులతో 2020 జనవరిలో స్పష్టత వచ్చింది. గతేడాది దేశవ్యాప్తంగా ఉన్న అన్‌లాక్ సమయంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి పనులు ముమ్మరంగా జరుగతున్నాయనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ దూసుకొచ్చి బ్రేకులు వేసింది.

కార్మికులతో పాటు ఇంజినీర్లు కూడా కరోనా బారిన పడ్డారు. టీకాలు తీసుకున్నప్పటికీ రోడ్లు భవనాల శాఖకు చెందిన కొద్దిమంది ఉద్యోగులు వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. సుమారు 60 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కార్మికులు వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాలేదు. రైలు సర్వీసులు కొన్ని ఆగిపోవడం, కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతుండడం కూడా కార్మికులు రావడానికి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం సచివాలయం నిర్మాణ పనులు ఫౌండేషన్ దాటుకుని బేస్‌మెంట్ స్థాయి వరకు వచ్చాయి. పనులు చేస్తున్న కార్మికుల్లో ఎక్కువగా ఒడిషా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందినవారే.

ఫాబ్రికేషన్, కార్పెంటరీ, బార్ బెండింగ్, చక్కలు కొట్టడం లాంటి పనులతో పాటు సిమెంటు కాంక్రీట్ మిక్సింగ్, సెంట్రింగ్ లాంటి పనులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే చేస్తున్నారని సైట్ ఇంజనీర్ ఒకరు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని లాక్‌డౌన్ ఎఫెక్ట్ సచివాలయ నిర్మాణానికి అవసరమైన సరుకుల రవాణాపై పెద్దగా లేకపోయినా కార్మికులపై మాత్రం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడిందని వివరించారు. కరోనా సోకకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ఇబ్బంది తప్పలేదని అభిప్రాయపడడారు. పనులు ప్రారంభించే సమయానికే కరోనా సమస్య ఉంటుందని అంచనా వేశామని, దానికి తగినట్లుగానే కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటించేలా పర్యవేక్షణ కూడా ఉందని గుర్తుచేశారు. అయినా చివరకు వెయ్యి మంది కార్మికులతో జరిగే పనులు ఇప్పుడు 200 మందితో మాత్రమే జరిగేదాకా దారితీసిందన్నారు.

కొత్త సచివాలయ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది జూలైలో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఎట్టి పరిస్థితుల్లో 12 నెలల గడువులోగా పూర్తికావాలని షాపూర్జీ పల్లోంజీ సంస్థకు స్పష్టం చేసింది. సంస్థ కూడా పనులను మూడు షిప్టుల్లో జరిగేలా ప్లాన్ చేసుకుంది. ఏయే పనులు ఎప్పటిలోగా జరగాలి, ఎలా పూర్తికావాలి తదితరాలన్నింటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ సంస్థ, రోడ్లు భవనాల శాఖ, ఆర్కిటెక్ట్ లతో సమావేశాలు నిర్వహించి రోడ్ మ్యాప్ రూపొందించారు. అనుకున్న షెడ్యూలు ప్రకారం పనులు జరిగేలా ఐదు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతీ రెండు వారాలకు ఒకసారి సమీక్షించేలా నిర్ణయం కూడా జరిగింది.

ప్లానింగ్ పక్కాగా ఉన్నా పనులకు సెకండ్ వేవ్ ఆటంకాలు కలిగించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి పనుల్లో స్పీడ్ పెంచి కీలకమైన పిల్లర్ల నిర్మాణాన్ని రెండు నెలల్లోనే పూర్తి చేసింది. పదకొండు అంతస్తుల భవన సముదాయం కోసం మొత్తం 194 భారీ పిల్లర్లను నిర్మించారు. ఒక్కో పిల్లర్‌కు ఓ రెండు పడకల గదుల ఇంటికి అయ్యేంత సిమెంట్, ఇసుక, కాంక్రీట్ మిశ్రమం పట్టింది. పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్‌కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి వరకు మొత్తంగా వెయ్యి మంది కార్మికులు పని చేశారు. వర్కర్లకు అక్కడే బస సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్వాహకులు. నిర్మాణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షెడ్లలోనే కార్మికులు ఉంటూ పనులు చేస్తున్నారు.

కానీ మార్చి మూడవ వారం నుంచి కార్మికుల్లో కొవిడ్ పాజిటివ్ నిర్థారణ కావడం మొదలైంది. కార్మికులతో పాటు ఆర్అండ్ బీ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ కంపెనీ తరపు ఇంజినీర్లలో కూడా పలువురికి కరోనా వచ్చింది. శ్లాబ్ కోసం చేస్తున్న పనులు ఇప్పటి వరకు 15 శాతం వరకే పూర్తయినట్లు అంచనా. కరోనా సెకండ్ వేవ్, దాని తర్వాత థర్డ్ వేవ్ కూడా వస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నందున ఇంకా ఎంతకాలం పనులు నత్తనడకన సాగుతాయన్నది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడం కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Next Story