మంత్రి ఎర్రబెల్లి బెదిరింపులు.. తగ్గేదే లేదన్న సర్ధార్ రవీందర్ సింగ్

by  |
మంత్రి ఎర్రబెల్లి బెదిరింపులు.. తగ్గేదే లేదన్న సర్ధార్ రవీందర్ సింగ్
X

దిశ, కరీంనగర్ సిటీ : విధులు, నిధులు లేకపోవడంతో పాటు కనీసం ఆత్మగౌరవం కూడా లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసమే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి శాసన మండలి సభ్యునిగా బరిలో నిలిచినట్లు ఎమ్మెల్సీ రెబల్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. సోమవారం కరీంనగర్ పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రతినిధులను క్యాంపుల్లో బెదిరింపులకు గురి చేస్తూ అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కామెంట్స్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ఇలా ఎవరికి ఓటు వేస్తున్నారో కనుక్కుని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బెదిరించడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయటంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పనితీరుపై, ఇచ్చిన హామీలు విస్మరించడం పట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఓటర్లను క్యాంపులకు తరలించి వారిపట్ల అనుచితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఓవైపు రాష్ట్రంలో వరి ధాన్యం కళ్ళాల్లోనే ఉండగా రైతుల సమస్యలు పరిష్కరించకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

మంత్రి కేటీఆర్ కనుసన్నల్లో రోజుకు 526 లారీల ఇసుక ఎలాంటి అనుమతుల్లేకుండా హైదరాబాద్‌కు తరలిపోతుందన్నారు. కొద్దీ రోజుల పాటు ఇసుక సరఫరా నిలిపేస్తే లారీల ద్వారా ధాన్యం మిల్లులకు చేరుతుందని తెలిసినా ఎందుకు ఆపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఏనాడైనా కొత్త చట్టాలపై కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారా? అని ప్రశ్నించారు. 18 ఎమ్మెల్సీ సీట్లలో ఒక్కటి కూడా మైనార్టీలకు కేటాయించలేదని, బీసీలకు కూడా కేవలం 2 మాత్రమే ఇచ్చి మిగతా సీట్లన్నీ అగ్రవర్ణ తెలంగాణ ద్రోహులకే అప్పగించారని దుయ్యబట్టారు. గెలిచిన అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు స్థానిక సంస్థల్లో సముచిత గౌరవం కల్పించేందుకు కృషి చేస్తానని స్పష్టం రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed