నోట్లను శానిటైజ్ చేసే యంత్రం… ఐఐటీ విద్యార్థుల కొత్త ఐడియా

by  |
నోట్లను శానిటైజ్ చేసే యంత్రం… ఐఐటీ విద్యార్థుల కొత్త ఐడియా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కంటికి కనిపించదు. మనం వాడే ఏ వస్తువు మీదనైనా వైరస్ నివసించే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంతోకొంత వైరస్ వచ్చే ఇబ్బంది ఉంది. ముఖ్యంగా కరెన్సీ నోట్లు. రోజువారీ జీవితంలో ఎక్కువగా చేతులు మారేవి ఇవే. సామాజికదూరంలో భాగంగా లావాదేవీల్లో దూరం నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ దాని మీద ఒకవేళ వైరస్ ఉంటే.. పరిస్థితి ఏంటి? అలాగని నోట్లను హ్యాండ్ శానిటైజర్ పెట్టి శుభ్రపరచలేం, సబ్బుతో కడగలేం. అయితే మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?

ఐఐటీ రోపర్ విద్యార్థులు కూడా ఇదే సమస్య గురించి ఆలోచించారు. కొవిడ్ 19తో పోరాడే క్రమంలో తమ వంతు భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. నోట్లను, సాధారణ కిరాణ సామాన్లను శానిటైజ్ చేయడానికి ఒక యంత్రం కనుగొన్నారు. అల్ట్రావయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ యంత్రం కరెన్సీ నోట్లను పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే దీని ఖర్చు రూ. 500 కంటే తక్కువే ఉంటుందని, ఇందులో పెట్టిన వస్తువులను 30 నిమిషాల్లో శానిటైజ్ చేస్తుందని ఐఐటీ రోపార్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నరేశ్ రఖా తెలిపారు.

కేవలం సామాజిక దూరం, బయటికి వెళ్లకపోవడం ద్వారా కరోనాను కట్టడి చేయలేం. వైరస్‌ని పూర్తిస్థాయిలో పారద్రోలాలంటే రానున్న రోజుల్లో ప్రతి చిన్న వస్తువును శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగడాన్ని నిరోధించడానికి తాము ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు నరేశ్ వెల్లడించారు.

Tags: Corona, Covid 19, sanitize, currency notes, IIT Ropar

Next Story