‘దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను తగ్గించడమే ఏకైక పరిష్కారం’

by  |
‘దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలను తగ్గించడమే ఏకైక పరిష్కారం’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దారుణంగా పెరుగుతున్న కరోనాను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి చర్యలు అవసరమని, ఇందులో భాగంగా ఆర్థిక కార్యకలాపాలను తగ్గించాలని భారతీయ పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) కేంద్రానికి సూచించింది. కరోనా సెకెండ్ వేవ్‌ను తగ్గించడానికి ఆర్థిక కార్యకలాపాలను తగ్గించడమే కాకుండా దేశవ్యాప్తంగా కీలక చర్యలు తీసుకోవాలని, ప్రజల జీవితాలను కాపాడ్డం ముఖ్యమని సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య రంగంలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే, భారీగా పెరిగే కేసులను ఇప్పుడున్న వైద్య సాంకేతికతతో అదుపు చేయడం వీలవదని, దీనికోసం తప్పనిసరిగా దేశీయ, విదేశీ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఉదయ్ కోటక్ అన్నారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది భద్రత కోసం, వైద్యానికి సంబంధించిన లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల కోసం సాయుధ బలగాలను మోహరించాలని సీఐఐ కేంద్రాన్ని కోరింది. కరోనా టీకా, ఇత వైద్య సంబంధిత అవసరాల నిమిత్తం రిటైర్డ్ హెల్త్‌కేర్ సిబ్బంది, డాక్టర్లను, నర్సులను ఉపయోగించుకోవడం అవసరమని ఉదయ్ కోటక్ తెలిపారు. అంతేకాకుండా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆర్‌టీ పీసీఆర్ టెస్టింగ్ సంఖ్యను రెట్టింపు చేయాలని సీఐఐ సూచించింది.



Next Story

Most Viewed