ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: ఆర్వీ కర్ణన్

by  |
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి: ఆర్వీ కర్ణన్
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్‌ను ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నందున ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్వీ‌ కర్ణన్ కౌంటింగ్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్లను లెక్కించాలని, కౌంటింగ్ అధికారులకు సూచించారు.

కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రంలో ఉదయం ఆరు గంటలకే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ టేబుల్స్ వద్ద అలాట్ చేసిన కౌంటింగ్ సిబ్బంది ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని అన్నారు. ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ అధికారులను టేబుల్స్ వద్దకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఉదయం 7.30 గంటలకు స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన 8 టేబుల్ల వద్ద ఏజెంట్ల సమక్షంలో సీల్ తీసి బ్యాలెట్ పేపర్‌లను 25 బండిల్స్‌గా కట్టాలని అన్నారు.

ముఖ్యంగా కౌంటింగ్ అధికారులు సెల్ ఫోన్లను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకురావొద్దని సూచించారు. బ్యాలెట్ పేపర్‌ల బండిల్స్ కట్టడం పూర్తి అయ్యాక ప్రధాన టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని అన్నారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజేషన్ చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద హెల్త్ క్యాంపు కూడా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవీ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కౌంటింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed