గురుకులాలకు భరోసా.. పనేషియా

by  |
గురుకులాలకు భరోసా.. పనేషియా
X

దిశ, హైదరాబాద్: కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ మూతబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గురుకుల విద్యాలయాలు మూసివేయాల్సి వచ్చింది. ఇందులో చదివే విద్యార్థులంతా ఇండ్లకు వెళ్ళిపోయారు. హాస్టల్‌లో ఉన్నప్పుడు వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వ సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇళ్ళకు వెళ్ళిన తర్వాత కూడా అదే కొనసాగుతోంది. అప్పడప్పుడు విద్యార్థులకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ ‘ఆన్‌లైన్’ పాఠాల హడావిడిలో మునిగిపోతే గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి మాత్రం విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఇంట్లో ఉన్నా ఏదేనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. ”మీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు వెంటనే ‘పనేషియా’ నంబర్లకు ఫోన్ చేయండి. మీ ఇంటి సభ్యులందరికీ ఈ నంబర్లు తెలిసేలా గోడలపై రాసుకోండి. ఎప్పుడు అవసరం వచ్చినా ఆ నెంబర్‌ను సంప్రదించండి” అని స్వయంగా సొసైటీ కార్యదర్శి అయిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. దీంతో విద్యార్థులంతా ఇంట్లోని గోడలపై పనేషియా సెంటర్ నంబర్లను రాసుకున్నారు.

పనేషియా సెంటర్ అంటే..?

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలకు ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యదర్శిగా వ్యవహారిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు సొసైటీలలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇవన్నీ రెసిడెన్షియల్ పాఠశాలలే. విద్యార్థుల ఆరోగ్య అవసరాలు, ఇతర బాగోగులను చూసేందుకు వార్డెన్లు, హెల్త్ విభాగం సిబ్బంది ప్రత్యేకంగా ఉన్నారు. విద్యార్థుల్లో ఏ ఒక్కరికి జబ్బు చేసినా ఆ పాఠశాలలో ఉండే హెల్త్ సూపర్‌వైజర్‌దే బాధ్యత. విద్యార్థులకు మాత్రలు అందించడం, వారి పరిధికి మించితే, స్థానికంగా ఉండే ఆస్పత్రికి తీసుకెళ్ళడం, ఇంకా పెద్దవైతే సొసైటీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌కు సమాచారం ఇవ్వడం, అందుకు సంబంధించిన వైద్య సదుపాయాల నిమిత్తం హైదరాబాద్‌లోని ఏదైనా పెద్ద ఆస్పత్రికి తరలిస్తుంటారు. విద్యార్థుల జబ్బుకు సంబంధించిన అన్ని విషయాలను రికార్డు చేస్తుంటారు. గురుకుల విద్యాలయాలలో చదువుకునే విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినా వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సొసైటీయే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది.

మీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డప్పుడు..

రాష్ట్రంలో కరోనా కేసులు ఉండడంతో సొసైటీ సిబ్బంది విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. బకాయి ఫీజులను వసూలు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కానీ, గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఓ వైపు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తూనే మరో వైపు కరోనా వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు చెందకుండా ధైర్యంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించేందుకు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ సైతం వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

tags: Gurukul, Dr RS Praveen Kumar, Panacea Center, Coronavirus, Lockdown, Online Lessons, Residential Schools


Next Story