రూ. 480 కోట్లు: 3 కోట్ల మందికి టీకా పంపిణీ ఖర్చు!

by  |
రూ. 480 కోట్లు: 3 కోట్ల మందికి టీకా పంపిణీ ఖర్చు!
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం తొలుత డాక్టర్లు, వైద్య సిబ్బందికి, అటు తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ వేసింది. మార్చి 1న రెండో విడత పంపిణీ ప్రారంభించింది. తొలి దశలో మూడు కోట్ల మంది కరోనా వారియర్లకు టీకా వేస్తామని గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి దశలో టీకా పంపిణీ నిర్వహణ, టీకా కొనుగోలు ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుందనీ వెల్లడించింది. మూడు కోట్ల హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ కోసం అయ్యే ఖర్చును కేంద్రం అంచనా వేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీ చౌబే ఈ విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారు. మూడు కోట్ల హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ చేయడానికి నిర్వహణ కింద రూ. 480 కోట్లు ఖర్చవుతుందని, టీకా డోసుల ధర రూ. 1392 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు 96.28 లక్షల హెల్త్‌కేర్ వర్కర్లు, 78.51 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు టీకా వేసుకున్నారని తెలిపారు. ఈ నెల 6వ తేదీనాటికి టీకా పంపిణీ మొదలుపెట్టి 50 రోజులు గడిచాయి. ఈ కాలంలో 2.06 లక్షల టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. రెండో విడత వ్యాక్సినేషన్‌లో 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, 45ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ టీకాను పంపిణీ చేస్తున్నారు.



Next Story

Most Viewed