రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ పదవికి వినోద్ దాసరి రాజీనామా..

by  |
CEO-Royal-enfeild
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ వినోద్ కె దాసరి తన పదవికి రాజీనామా చేసినట్టు ఐచర్ మోటార్స్ గురువారం ప్రకటించింది. అంతేకాకుండా ఐచర్ మోటార్స్ లిమిటెడ్ డైరెక్టర్(హోల్‌టైమ్) పదవి నుంచి కూడా ఆయన వైదొలగినట్టు సంస్థ తెలిపింది. వినోద్ కె దాసరి రాజీనామా శుక్రవారం(ఆగష్టు 13) నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐచర్ మోటార్స్ లిమిటెడ్‌కు గోల్‌టైమ్ అడిషనల్ డైరెక్టర్‌గా బి గోవిందరాజన్ నియామకాన్ని సంస్థ ఆమోదించింది.

ఆయన నియామకం ఆగష్టు 18 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కంపెనీల చట్టం-2013 నిబంధనలకు లోబడి వచ్చే ఐదేళ్ల కాలానికి బి గోవిందరాజన్‌ను నియమించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. ప్రస్తుతం గోవిందరాజన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పనిచేస్తున్నారు. వినోద్ కె దాసరి 2019లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓగా నియమించబడ్డారు. అంతకుముందు 2011 నుంచి ఆయన అశోక్ లేలండ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వినోద్ కె దాసరి ఇటీవలే చెన్నైలో లాభాపేక్షలేని ఆసుపత్రిని స్థాపించారు. సరసమైన, అందుబాటు ధరలో ఆరోగ్య సౌకర్యాల నిర్మాణానికి తన సమయాన్ని కేటాయించాలని భావించారని, అందుకే పదవికి రాజీనామా చేసినట్టు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.



Next Story

Most Viewed