ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న రోజర్ ఫెదరర్

by  |
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న రోజర్ ఫెదరర్
X

దిశ, స్పోర్ట్స్ : మాజీ వరల్డ్ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్ మోకాలి గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ 2021 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆదివారం ఉదయం మూడో రౌండ్‌లో 59వ ర్యాంకర్ డోమినిక్ కోఫర్‌పై రోజర్ ఫెదరర్ 7-6 (7-5), 6-7 (3-7), 7-6 (7-4), 7-5 తేడాతో విజయం సాధించాడు. మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడు సెట్లు టై బ్రేకర్ ద్వారానే తేలడం గమనార్హం. మ్యాచ్ఆసాంతం అసౌకర్యంగా కదిలిన రోజర్ ఫెదరర్ బలమైన షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించి ఆఖరుకు విజయం సాధించాడు. అయితే గత ఏడాది మోకాలికి రెండు సార్లు శస్త్ర చికిత్స తీసుకొని కోలుకున్న తర్వాత ఫెదరర్ తొలి సారిగా గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నాడు. కానీ అతడి మోకాలి నొప్పి తిరగబెట్టడంతో టోర్నీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. ‘నేను నా టీమ్‌తో మాట్లాడిన తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను.

రెండు మోకాలి శస్త్ర చికిత్సల అనంతరం, రీహాబిలిటేషన్ తర్వాత కూడా నా శరీరం సహకరించడం లేదని తెలుస్తున్నది. ఈ సమయంలో నా శరీరం చెప్పినట్లు నేను వినాల్సిందే. త్వరగా కోలుకోవడానికి పరిగెత్త వద్దని అర్ధం అయ్యింది. మూడు మంచి మ్యాచ్‌లు ఆడాను, కోర్టులో తిరిగి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉన్నది.’ అని ఫెదరర్ ట్వీట్ చేశాడు. కాగా, అతడు ఫ్రెంచ్ ఓపెన్ నుంచి విరమించుకోవడంతో రోలాండ్ గారోస్ టోర్నీ నిర్వాహకులు బాధతో వీడ్కోలు పలికారు. అతడు గత రాత్రి అద్భుతమైన పోరాటంతో మ్యాచ్ గెలిచాడు. అతడు ఉంటే మంచి క్వాలిటీ టెన్నిస్ చూడగలం. మిగిలిన సీజన్‌లో అయినా అతడు కోర్టులో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము అని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు తెలిపారు. టోర్నీ ప్రారంభంలో మెంటల్ హెల్త్ కారణంగా మహిళా క్రీడాకారిణి నయోమీ ఒసాకా తప్పుకోగా, ఇప్పుడు దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ వెళ్లిపోవడంతో టోర్నీకి పెద్ద ఎదురు దెబ్బే అని అనుకోవాలి.

Next Story