మున్నాళ్ల ముచ్చటైన లోకేశ్వరం- పేండ్ పెళ్లి రోడ్డు.. రూ. 5 కోట్లు వృథా

by  |
Roads-1
X

దిశ, లోకేశ్వరం: అధికారుల అలసత్వమో.. కాంట్రాక్టర్ ధనదాహమో తెలియదు కానీ, రూ. 5 కోట్ల వ్యయంతో వేసిన తారు రోడ్డు ఏడాది కూడా కాకుండానే వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో రూ. 5 కోట్ల ప్రజాధనం వృథా అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. లోకేశ్వరం మండలం నుండి భైంసా పట్టణంతోపాటు కుంటాల మండలంలోని పలు గ్రామాలకు దూర భారం తగ్గించేందుకు లోకేశ్వరం నుండి భైంసా మండలంలోని పేండ్ పెళ్లి గ్రామం వరకు గత వేసవిలో ప్రధానమంత్రి సడక్ యోజన నిధులు రూ. 5 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మించారు. అంతవరకు బాగానే ఉన్నా నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వర్షాకాలంలో సంభవించిన వరదలకు దాదాపు 200 మీటర్ల వరకు రోడ్డు, అలాగే మరో రెండు చోట్ల 50 మీటర్ల వరకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.

ఎత్తు ప్రదేశంలో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం వల్ల సమస్య..

రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేసే సమయంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా అగుపడుతోంది. నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాల్లో ఎత్తు ప్రదేశాల్లో వాటిని నిర్మించడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఆ ప్రదేశాల్లో రోడ్డు తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల తేలికపాటి వరదలకు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.

మొరంతో పనులు చేయిస్తున్న అధికారులు..

బీటీ రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాల్లో అధికారులు ఇటీవల మొరంతో పనులు చేయించి చేతులు దులుపుకున్నారు. దీంతో మండల ప్రజలు భైంసా పట్టణంతోపాటు కుంటాల మండలంలోని పలు గ్రామాలకు వెళ్లాలంటే దూరభారం తప్పడం లేదు. ఐదు సంవత్సరాల వరకు సంబంధిత కాంట్రాక్టర్ ది రోడ్డు నిర్వహణ బాధ్యత ఉండగా మళ్లీ ఆ ప్రాంతంలో తారు రోడ్డు వేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని తారు రోడ్డు వేయించి వరదలకు అనుకూలంగా బ్రిడ్జిలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed