ఐమ్యాక్స్ 1980's.. ప్రాభవాన్ని కోల్పోతున్న ఓల్డ్ థియేటర్స్‌పై షార్ట్ ఫిల్మ్

by  |
LB Sriram
X

దిశ, సినిమా : టెక్నాలజీ పునాదుల మీద పరుగెడుతున్న కాలం.. అప్‌డేట్ కాకపోతే అవుట్‌డేట్ అయిపోయే రోజులు.. పైసలు తప్ప ప్రేమపాశాలకు, రాగద్వేషాలకు తావులేని సమాజం.. వెరసి విలువలు అనే మాటకు విలువే లేకుండా పోయిన మోడ్రన్ సొసైటీ.. అయినా ఎడారిలో నీటిచెమ్మలా ఎక్కడో ఒక చోట విలువలే ఆస్తులుగా బతికేవారూ ఉంటారు. ప్రలోభాలకు ఒక్క క్షణం లొంగిపోతే చాలు.. అంతులేని ఐశ్వర్యం, పలుకుబడి తమ ముందు మోకరిల్లుతాయని తెలిసి కూడా నిక్కచ్చిగా తమ సిద్ధాంతాలకే లోబడి లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలెదురైనా లెక్కచేయకుండా, రేపటి కొత్త వెలుగు కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ‘దొరబాబు’ జీవితం కూడా అలాంటిదే.. థియేటర్ యజమానిగా ఒకప్పుడు తెలుగు సినీ చరిత్రలో గోల్డెన్ ఎరాను కళ్లారా చూసిన ఆయన.. ఈ మల్టీప్లెక్స్‌లు, ఐమ్యాక్స్‌ల కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలను, కోల్పోతున్న ప్రాభవాన్ని హృద్యంగా చూపెట్టిన లఘు చిత్రం ‘ఐమ్యాక్స్ 1980’.

హైటెక్ హంగులతో ప్రేక్షకుడి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను సమూలంగా మార్చిన ఈ మల్టీప్లెక్స్ కల్చర్.. శ్రీ గోపాల పిక్చర్ ప్యాలెస్ థియేటర్ యజమాని అయిన దొరబాబు (ఎల్బీ శ్రీరామ్) జీవితంలో ఆనందం లేకుండా చేస్తుంది. ప్రేక్షకులు లేకున్నా సరే.. తన థియేటర్‌లో ఇప్పటికీ ఎన్టీఆర్, చిరంజీవి నటించిన పాతతరం సినిమాలను ఒక్కరి కోసమైనా ఆడిస్తూ తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవిస్తుంటాడు. ఈ క్రమంలో థియేటర్ కరెంటు బిల్లు కట్టేందుకు కూడా ఇబ్బందులు పడుతుంటాడు. థియేటర్ సినిమాలతో కళకళలాడిన రోజుల్లో ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా తాగుబోతులను హాలులోనికి అడుగుపెట్టనివ్వని దొరబాబు.. ఇప్పుడు పనిలేక ప్రొజెక్టర్ ఆపరేటర్ అక్కడే తాగిపడుకుంటే గతాన్ని తలచుకుని నిట్టూర్చడం తప్ప, ఏమీ చేయలేని నిస్సహాయత తనది. బూతు చిత్రాలు ఆడించుకుంటే కావలసినంత డబ్బు ఇస్తామంటే తల్లడిల్లిపోయే దొరబాబు.. ఆ సందర్భంలో ‘తెలుగు చలనచిత్ర చరిత్రలో సగభాగానికి సజీవ సాక్ష్యం ఈ వెండితెర.. నిన్న మొన్న చూసిన ఐమ్యాక్స్ కాదురా ఇది, నువ్వు పుట్టకముందు ఇదొక పెద్ద ఐమ్యాక్స్’ అంటూ అప్పట్లో సినిమా హాళ్ల ముందు నెలకొన్న పండగ వాతావరణం గురించి, ప్రేక్షకుడు అనుభవించిన భావోద్వేగాల గూర్చి చెప్పే డైలాగ్ కంటతడి పెట్టిస్తుంది. ‘అమ్మ పాలు తాగి అమ్మతోనే వ్యభిచారం చేయించమంటావా రా కుక్క’ అంటూ తల్లడిల్లిపోతాడు దొరబాబు. మిగతా థియేటర్ల ఓనర్లలా తాను కార్పొరేట్ వ్యవస్థకు లొంగిపోనంటాడు.

తన కొడుకు ఢిల్లీలో మంచి ఉద్యోగం చేస్తు్న్నా.. ఇక్కడ మాత్రం తను ఒక్కడే ఉంటూ, పార్కింగ్ నుంచి క్యాంటీన్ వరకు అన్ని పనులు తనే చేసుకునే దొరబాబుకు థియేటర్‌పైనున్న ప్రేమ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఈ క్రమంలో తను పాటించే పాతకాలం పద్ధతులను కొడుకు నుంచి అందిన లెటర్ ద్వారా చక్కగా చూపించారు దర్శకుడు. చివరగా ఓ ప్రేక్షకుడి కోరిక మేరకు ‘శంకరాభరణం’ సినిమాను ఆడించేందుకు ‘పురజనుల కోరిక మేరకు శంకరాభరణం’ అనే పోస్టర్‌ వేస్తూ దొరబాబు గర్వంగా చూస్తున్న సీన్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ ముగియగా.. థియేటర్ యజమాని పాత్రలో ఎల్బీ శ్రీరామ్ లీనమైన తీరును మెచ్చుకోకుండా ఉండలేం.

మొత్తానికి మల్టీప్లెక్స్‌ల ఉక్కు పిడికిలిలో కాలగర్భంలో కలిసిపోయిన, పోతున్న అనేక థియేటర్ల పరిస్థితిని, యజమానుల దీనస్థితిని, ప్రేక్షకుడితో సినిమా హాళ్లకున్న బంధాన్ని చిత్రీకరించిన విధానం ప్రశంసనీయం.

Next Story

Most Viewed