కలెక్టరేట్ పేషీల్లో పాలక కోటరీ..

by  |
కలెక్టరేట్ పేషీల్లో పాలక కోటరీ..
X

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్త జిల్లాలు పెరిగాయి. పరిపాలనలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం రెవెన్యూలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ల పాత్ర క్రియాశీలకమని ప్రచారం చేస్తూ ప్రగతి భవన్‌లో రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం సమీక్షలు చేస్తున్నారు. కానీ జిల్లా స్థాయిలో పరిపాలన వ్యవస్థకు కేంద్ర బిందువైన కొన్ని జిల్లాల కలెక్టరేట్లలో మాత్రం ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. కొన్ని కలెక్టరేట్లల్లోని పేషీల్లో సిబ్బంది పనితీరు నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. సొంత రెవెన్యూ సహచరుల పనులనే పెండింగులో పెడుతున్నారు. పదోన్నతుల జాబితాలు రూపొందించడం, లీవ్స్ మంజూరు చేయడం, సర్వీసు అంశాల్లో సతాయిస్తున్నట్లు సమాచారం. ఏ పని కావాలన్నా మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, పై అధికారుల పర్యవేక్షణ లోపంతోనే కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఉద్యోగికీ వారి సర్వీస్ మ్యాటర్లు చాలా కీలకం. కానీ వాటికి సంబంధించిన తమ సమస్యలు పరిష్కరించమని కలెక్టరేట్ మెట్లెక్కే రెవెన్యూ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనట్లు తెలుస్తోంది. ఏ పని కావాలన్నా పైసలు విదల్చనిదే పురోగతి కనిపించడంలేదని బాధితులు వాపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే అక్కడి సెక్షన్ అధికారులు తమ ఫైళ్ల విషయంలో ఎలాంటి కొర్రీలు పెడతారోనని, పై అధికారులకు తమపై ఎలాంటి ప్రతికూల నివేదికలు ఇస్తారోనని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్ల విషయంలో సంప్రదించాల్సి వస్తే.. ‘సిబ్బంది కొరత ఉంది. ఫైల్ స్టడీ చేయాలి. ఇంతకాలం ఏం చేశావు. ఇప్పుడే ఎందుకు చేయాలి. చేస్తే నాకేం వస్తుంది’ అని సంబంధం లేని ప్రశ్నలతో వేధిస్తున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. చాలా కలెక్టరేట్లల్లో మంత్రుల బంధువులు, ఎంపీల దోస్తులతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేల పేర్లు, అధికార పార్టీ నాయకులతో సంబంధాలను గుర్తు చేస్తూ ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏండ్ల తరబడి ఉద్యోగుల ఫైళ్లు కదలడం లేదు. కొన్ని కలెక్టరేట్లల్లో దశాబ్దాల తరబడి ఒకే చోట పని చేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. పదోన్నతులు లభించినా అదే స్థానంలో కూర్చుంటున్న ఉదంతాలు ఉన్నాయి.

కొన్నింటిని పరిశీలిస్తే..

– వారితో సమాన హోదా కలిగిన ఒక తహసీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఒక సమీక్షా సమావేశంలో సందేహం నివృత్తి విషయమై కలెక్టర్‌ను అడిగారు. దానికి వారిపై క్రమశిక్షణ చర్యల కింద కలెక్టర్‌తో రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టించే స్థాయిలో వారి ప్రవర్తన ఉంది.

– ఒక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో.. ‘మాజీ ఎంపీ, సీఎంకి సన్నిహితుడు నాకు బాగా తెలుసు. గతంలో ఒకరిద్దరు కలెక్టర్ల దగ్గరే నేను సహాయకుడిగా పనిచేశాను. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారి మా సామాజికవర్గం వర్గం వారే’ అంటూ ఒకతను దబాయిస్తున్నారు. చివరికి గతంలో పనిచేసిన ఒక పర్యవేక్షణాధికారిని సైతం ఆ స్థానం నుంచి తప్పించి, ఆ కుర్చీలో కూర్చోవడానికి ఇదే సమీకరణం పని చేసింది. సదరు అధికారి గతంలో నర్సంపేట డివిజన్‌లో తహసీల్దారుగా పనిచేసినప్పుడు పట్టాదారు పాసు పుస్తకాల జారీలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి చాలా మంది రైతులకు చికాకులు సృష్టించడం వల్లే తనకు ఎన్నికల్లో ఆధిక్యత తగ్గిందని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

– కొన్ని కలెక్టరేట్లలో కొందరు ఉద్యోగుల తీరు మిగతా ఉద్యోగులను ఇబ్బందికి గురి చేస్తోంది. వారిని ఎవరైనా ప్రశ్నిస్తే ‘మంత్రి గారి భార్య తరఫు బంధువును‘ అంటూ బెదిరిస్తున్న ఉదంతాలు ఉన్నాయి.

– ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో రూ.లక్షలు బాధితుల నుంచి అక్రమంగా వసూలు చేశాడని తీవ్ర ఆరోపణలు వచ్చిన ఒక సహాయకుడిని ఏరికోరి కలెక్టరేట్లో ఉంచారు.

– ‘డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల వల్ల రెవెన్యూ వ్యవస్థ పాడవుతున్నది’ అని ఇటీవల గ్రూప్-2 ద్వారా ప్రోడీటీ అయిన అధికారిని దూషించినట్లు తెలిసింది.

– ‘మీరు నాకు సరిగా విష్ చేయనప్పుడు మీ పని నేనెందుకు చేయాలి?’ అని ఒక మహిళా ఉద్యోగి లీవ్ మ్యాటర్‌ను సుమారు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంచిన ఉదంతాలు కలెక్టరేట్లల్లో ఉన్నాయి.

– ‘నేనెవరినో తెలియకుండానే నా దగ్గరికి వచ్చి నన్నే అడుగుతావా’ అని ఒక జూనియర్ అసిస్టెంట్‌ను నేటి వరకు సర్వే ట్రైనింగ్ పంపకపోవడంతో సదరు ఉద్యోగి పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం ఎదుర్కొంటున్నారు.

– 2019 మే, జూన్ నెలల్లో సర్వే ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థు లకు సంబంధించి కలెక్టరేట్ నుంచి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇప్పించడానికి రూ.20 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

– ఇటీవల వీఆర్ఏల పదోన్నతుల కోసం కేవలం సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసి పంపేందుకు కూడా డబ్బులు వసూలు చేసిన కలెక్టరేట్లు ఉన్నాయి. లిస్టు పంపకుండా జాప్యం చేస్తే కొందరు వీఆర్ఏలు ఓ మాజీ ఎంపీ, అధికారి పార్టీ ఎమ్మెల్యేకు మొర పెట్టుకున్నారు. దాంతో వారు సదరు కలెక్టరేట్ అధికారికి ఫోన్ చేసి మందలించారు. అయినా రూ.30 వేలు తీసుకొని లిస్టు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

..ఇకనైనా సుదీర్ఘ కాలంగా ఒకే చోట కలెక్టరేట్లల్లో పని చేస్తోన్న అధికారులు, ఉద్యోగుల స్థితిగతులపై దర్యాప్తు చేయాలని, దాని వెనుకున్న సూత్రదారులు, మద్దతుదారులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Next Story

Most Viewed