ఐపీఎల్… లైవ్ ఖజానా

by  |
ఐపీఎల్… లైవ్ ఖజానా
X

దిశ, స్పోర్ట్స్: ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. 2017లో స్టార్‌ఇండియా అత్యధిక మొత్తానికి ఐపీఎల్ రైట్స్ తీసుకున్నది. ఆ సమయంలో కొంత మంది బోర్డు ఉన్నతాధికారులు ఇలా మాట్లాడుకున్నారట. ‘ఐపీఎల్ వల్ల స్టార్‌ఇండియా అంబానీనే మించిపోయింది. ముఖేష్ అంబానీ నిమిషానికి రూ.16లక్షలు సంపాదిస్తాడు. కానీ, స్టార్‌ఇండియా 10 సెకన్లకే రూ.12లక్షలు సంపాదించనున్నది’ అని అనుకున్నారు. ఈ విషయం ఆ అధికారులు మాట్లాడుకున్నారో లేదో తెలియదు. కానీ, ప్రస్తుతం ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ సంపాదన చూస్తే నిజమనే అనుకోవచ్చు.

మొదటి పదేళ్లు ఇలా..

ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి అత్యధిక ఆదాయం సమకూర్చేది బ్రాడ్‌కాస్టింగ్ హక్కులే. 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు టీవీ ప్రసార హక్కులను మల్టీస్క్రీన్ మీడియా(సోనీటీవీ)కి కట్టబెట్టారు. 10ఏళ్లకు రూ.8200కోట్లకు బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు ఇచ్చారు. ఈ రైట్స్ క్రికెట్ ప్రసార హక్కుల్లో రికార్డు సృష్టించింది. అప్పట్లో ఓటీటీ, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ పెద్దగా అభివృద్ది చెందలేదు. 2012 తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం పెరగడం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు చవకగా లభించడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. 2015-2018 మధ్య కాలానికి ప్రత్యేకంగా ఇంటర్నెట్ హక్కులను స్టార్‌ఇండియాకు రూ.302కోట్లకు విక్రయించింది. తొలి పది సీజన్లకు ఐపీఎల్ ద్వారా మొత్తం రూ.8,502కోట్లు సమకూరాయి.

ఆతర్వాత డబ్బే డబ్బు..

ఐపీఎల్-2017తో సోనీటీవీ కాంట్రాక్టు ముగిసిపోయింది. దీంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు పిలిచింది. ఈసారి 10ఏళ్లకు కాదు. కేవలం ఐదేళ్లకు అదీ కేటగిరీల వారీగా టెండర్లు ఆహ్వానించింది. టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, గ్లోబల్ పేరిట హక్కులను విభజించింది. ఈ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు పోటీ పడ్డాయి. తొలి దశలో ఫేస్‌బుక్, భారతీ ఎయిర్‌టెల్, జియో, సోనీ మూవీస్ సంస్థలు పోటీ పడ్డాయి. కానీ, స్టార్‌ఇండియా గ్లోబల్ హక్కుల (అన్ని కేటగిరీలు) కోసం రూ.16,347కోట్లకు బిడ్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే పెద్ద బిడ్ కావడంతో ఐపీఎల్ హక్కులు స్టార్ఇండియాకే దక్కాయి. ప్రస్తుతం ప్రతి మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు (అంచనా) బీసీసీఐకి సమకూరుతున్నాయి.

తిరిగి ఎలా వస్తాయి?

ఐదేళ్ల ప్రసార హక్కుల కోసం రూ.వేల కోట్ల పెట్టుబడి పెట్టిన స్టార్ఇండియా ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవడానికీ పెద్ద ప్రణాళికే వేసింది. ప్రతి ఏడాది యాడ్స్ రూపంలో కనీసం రూ.3500కోట్ల నుంచి రూ.4000కోట్లు రాబడితే కాని పెట్టుబడి వెనక్కి రాదు. 2018లో స్టార్ఇండియా 125 బ్రాండ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో ఒక్కో యాడ్ 10 సెకెన్ల కాలానికి రూ.8లక్షల వరకు ఉండేది. దీంతో కేవలం యాడ్స్ ద్వారా రూ.2500కోట్లు వచ్చాయి. ఆ తర్వాత ఏడాది కూడా రూ.2700కోట్లు సమకూరాయి. కానీ, ఈ మొత్తం స్టార్ఇండియా కేవలం టీవీ ప్రసారాల ద్వారా సంపాదించిందే. అదే సమయంలో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్స్, అందులో యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.1500కోట్ల వరకు సంపాదించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ప్రతి ఏడాది రూ.4వేల కోట్ల ఆదాయం స్టార్‌ఇండియా ఖజానాకు చేరుతున్నది. ఐపీఎల్- 2020 ద్వారా ప్రస్తుతం 10 సెకెన్ల యాడ్‌కు రూ.12.5లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది లీగ్ యూఏఈలో జరగడం స్టార్‌ఇండియాకు కలసి వచ్చింది.

పెరగనున్న ఆదాయం..

ఐపీఎల్-2020లో బ్రాడ్‌కాస్టర్‌కు ఆదాయం పెరగనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్‌ను స్టేడియాల్లో ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడంతో అందరూ టీవీ లేదా హాట్‌స్టార్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత వారంలో బార్క్ రేటింగ్స్‌లో ఐపీఎల్ టాప్‌లో ఉన్నది. హాట్ స్టార్‌లో ప్రతిరోజు సగటున 35లక్షల మంది మ్యాచ్ వీక్షిస్తున్నారు. గతంలో స్టార్‌ఇండియా సీజన్‌‌కు రూ.4వేల కోట్లు సంపాదించింది. ఈసారి రూ.6వేల కోట్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది.

Next Story

Most Viewed