ఎమ్మెల్యే పెత్తనం.. వణికిపోతున్న అధికారులు

by  |
ఎమ్మెల్యే పెత్తనం.. వణికిపోతున్న అధికారులు
X
ఆ ఎమ్మెల్యే అంటే అక్కడ వెన్నులో వణుకు.. ఆయన ఫోన్ ఎత్తాలంటేనే భయం. ఆదేశాలు అమలు చేయలేకపోతే బదిలీ తథ్యం. అధికార బలంతో ఉద్యోగులు, అధికారులపై కేసులు నమోదు చేయిస్తారన్న ఆందోళన. ఈ క్రమంలోనే అక్కడెవరూ పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎప్పుడు బదిలీ చేస్తారోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. కొందరు తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ సిబ్బంది పని చేయాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ప్రజల దృష్టిలో ప్రచారం పొందటానికి తమను బద్నాం చేస్తున్నారని వాపోతున్నారు. సెటిల్‌మెంట్ల కోసం ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 9 ప్రకారం భూమికి సంబంధించి ప్రభుత్వ అధికారిపై దావా వేయరాదని స్పష్టంగా ఉంది. ఆ ఎమ్మెల్యే మాత్రం తహసీల్దార్ పైనే కేసు నమోదు చేసి తన సత్తాను చాటారు. తన సామాజిక వర్గీయులకే అత్యంత ప్రాధాన్యమిస్తూ తరచూ మీడియాలో కనిపిస్తున్నారు. ప్రతి కాంట్రాక్టు తన వర్గీయులకే దక్కేటట్లుగా శ్రద్ధ వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బినామీ పేర్లతో చిన్న చిన్న పనులు కూడా ఆయనే చేపడుతున్నారని తెలిసింది. రూ.లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా ఏం దక్కకుండా చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సంచలన కామెంట్లు చేస్తూ విధ్వంసానికి కారణమవుతున్న ఆ ఎమ్మెల్యే బాగోతం అంతా ఇంతా కాదు.. వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో రెవెన్యూ వర్గాలు భయాందోళనకు గురవుతున్న ఉదంతమిది.

వీఆర్వో, తహసీల్దార్‌పై కేసు నమోదు

వరంగల్ నగరానికి పక్కనే ఉన్న ఓ మండలంలో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పొరపాటు చోటు చేసుకుంది. ఈ విషయంలో ఆ ఎమ్మెల్యే మితిమీరిన జోక్యం వివాదాస్పదమైంది. పాస్ పుస్తకంలో విస్తీర్ణం మిస్సయితే ఆర్వోఆర్ చట్టం ప్రకారం తిరిగి పొందే అవకాశం ఉంది. నోటీసులు జారీ చేసి సరి చేయొచ్చు. తహసీల్దార్ పని చేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కానీ పోలీసు స్టేషనులో తహసీల్దార్ పై కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ముగ్గురిపై క్రిమినల్ కేసు పెట్టారు. ఎమ్మెల్యే ముగ్గురిని అరెస్టు చేయాల్సిందిగా పంతం పట్టారు. దాంతో ముగ్గురు కూడా, దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.

రూ.కోట్లు విలువ జేసే 1.26 ఎకరాలను తహసీల్దార్ ఆఫీసులో పని చేస్తోన్న కంప్యూటర్ ఆపరేటర్ సంబంధీకుల పేరిట పట్టా అయ్యింది. రికార్డుల ప్రక్షాళనలో తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో, బల్క్ డిజిటల్ సైన్ ఆప్షన్ల వల్ల జరిగింది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే రైతుబంధు పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జరిగింది. అప్పటి భౌతిక రికార్డులను పరిశీలించి చేశారు. సదరు పట్టాదారుడి దరఖాస్తును పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు 2020 చట్టం వచ్చేసింది. దాంతో తహసీల్దార్, ఆర్డీవోలకు పరిష్కరించే అధికారం లేకుండా పోయింది. ఈ కేసు రెవెన్యూ ట్రిబ్యునల్ పరిధిలోకి వెళ్లింది. ఇదే విషయాన్ని సదరు పోలీసులకు వివరించినా పట్టించుకోకుండా కేసు నమోదు చేశారు.

ప్రతి అంశంలోనూ ఆయనే..

గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశంలో కూడా కాంట్రాక్టు పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయించడం లేదని బల్దియా ఇంజినీర్లపై ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్స్‌టైల్ పార్కు అంశానికి సంబంధించి వరంగల్ రూరల్ కలెక్టరేట్‌లో సదానందం అనే తహసీల్దార్‌ని కూడా విధుల్లో ఉండగా తీవ్రంగా దుర్భాషలాడి బెదిరించారు. క్షేత్ర పర్యటనలకి వెళ్లినప్పుడు రెవెన్యూ అధికారులతో ప్రొటోకాల్ చేయించుకోవడం, అదే సమావేశాల్లో సభా ముఖంగా అదే అధికారులను కించపర్చడం సర్వసాధారణంగా మారింది. కల్యాణలక్ష్మి చెక్కుల సందర్భంగా కూడా అధికారులను క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని ప్రజల ముందే మందలించడం రివాజుగా మారింది.

ఓ తహసీల్దార్‌ని ఫోన్‌లోనే రాయలేని పదజాలంతో దూషించడంతో మనస్తాపం చెంది రెండు నెలలుగా సెలవు పెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్యే మనుషులు కొందరు రెండు గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డు, పట్టా భూముల్లో మొరం మాఫియా నిర్వహిస్తుండటంతో వాటికి సహకరించలేదనే కారణంతో తీవ్రంగా మందలించడంతో గతంలో తహసీల్దారు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మరో మూడు మండలాల్లో స్థానిక గుట్టల వద్ద కంకర క్రషర్లకి అవసరమైన బండల కోసం నిత్యం అక్కడి క్వారీల్లో పేలుళ్లు జరుపుతున్నారు. ఏడాది కిందట ఇద్దరు మనుషులు మరణించారు. ప్రతిపక్షాల నాయకులపై తీవ్ర నిర్బంధం మోపి నయానో భయానో అధికార పార్టీలో చేర్పించడం, లొంగని వారిపై పోలీసుల సాయంతో అక్రమ కేసులు బనాయించి బెయిలు కూడా దొరక్కుండా జైల్లో వేయించడం వంటివి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వరంగల్ నగరాన్ని ఆనుకొని ఉన్న రెండు గ్రామాల్లో ప్రధాన మున్సిపల్ ప్రాంతాల్లో అనుచరుల ఆక్రమణలు, కబ్జాలు, సెటిల్‌మెంట్లు భారీగా పెరిగి పోయాయన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే అండదండలతోనే దందా కొనసాగుతోంది.

సెటిల్మెంట్ల దందా

వరంగల్- నర్సంపేట రహదారిపై ఒక ప్రధాన మండలంలో సుమారు రూ.5 కోట్ల విలువైన 3 ఎకరాల పట్టా భూమికి సంబంధించి సివిల్ కోర్టు, గతంలో రెవెన్యూ కోర్టు (ఇప్పుడు ప్రత్యేక ట్రిబ్యునల్), హైకోర్టులో ఉన్న ఒక కేసు విషయంలో వాస్తవ హక్కుదారుని బెదిరించి, అధికార పక్షం నాయకులు సెటిల్మెంటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. అందులో స్థానిక ఆర్డీవో, తహసీల్దారుపై తీవ్ర ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ కేసులో వాస్తవ హక్కుదారు వారసుల్లో ముగ్గురు వ్యక్తులు న్యాయం లభించక తీవ్ర మనోవేదన చెంది మరణించడం విషాదకరం.

వారికి ఆ భూమిలో పూలు సాగు చేసి, మాలలు కట్టి అమ్మడమే జీవనాధారం. వారి భూమి జాతీయ రహదారి పక్కనే ఉండటం, గతంలో ఒక మధ్యవర్తి ద్వారా రెవెన్యూ రికార్డులో తప్పుడు నమోదులు కావడమే వారు చేసుకున్న పాపంగా మారింది. మరో గ్రామంలో సుమారు 75 ఎకరాల పట్టా భూమికి సంబంధించి వాస్తవంగా సాగు చేసుకుంటున్న యజమాని, వ్యాపారవేత్త ఆస్తుల విషయంలోనూ సెటిల్మెంట్ చేశారు. వారికి పట్టా చేయాలని ఆర్డీవో, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరో గ్రామంలోని ఒక వివాదాస్పద భూమికి సంబంధించి నాలా కన్వర్షన్ చేయించినందుకు తన వాటాగా సుమారు రూ.కోట్ల విలువైన ఎకరం భూమి బినామీ పేరిట రాయించుకున్నారని తెలిసింది.



Next Story

Most Viewed