ఆ అధికారుల తీరు ‘మామూలే’

by  |
ఆ అధికారుల తీరు ‘మామూలే’
X

దిశ, క్రైమ్ బ్యూరో: పాలనా యంత్రాంగంలో బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను గాలికొదిలేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా మలుచుకుంటూ అవినీతి అందలం ఎక్కేందుకు అత్యంత ఉత్సాహం చూపెడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల పనులను చక్కబెట్టేందుకు లంచాలకు అలవాటు పడుతున్నారు. అవినీతిలో నిండా మునిగిపోతున్నారు. అంతే కాదు, విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజల డబ్బును ప్రభుత్వం నుంచి వేలు, లక్షల రూపాయల వేతనాలుగా అందుకుంటున్నా.. అవినీతి రంగంలో రారాజులు కావాలని కలలు కంటున్నారు. లంచాలు తక్కువ మొత్తంలో పుచ్చుకుంటే నలుగురిలో ఎక్కడైనా చులకన భావానికి గురవుతానోనని తెగ ఫీల్ అవుతారనుకుంటా కాబోలు. అందుకే, అవినీతి అనకొండలు ఆకాశమే హద్దుగా లక్షలు, కోట్ల రూపాయలను లంచాలుగా పుచ్చుకుంటున్నారు. గణాంకాల పరంగా ఈ ఏడాది ఏసీబీ విభాగంలో అవినీతి కేసుల నమోదు సంగతి ఎలా ఉన్నా.. మునుపెన్నడూ లేనట్టుగా లంచంగా తీసుకుంటున్న డబ్బులు అవినీతి వరదలా కట్టల కట్టలు పారుతున్నాయి.

అవినీతి కట్టలు వరదలా..

అవినీతి మరకలో వేలు పెట్టే అధికారులు ఒకప్పుడు కేవలం వందలకు మాత్రమే పరిమితం అయ్యేవారు. ఈ కొద్ది మొత్తాన్ని పుచ్చుకోవడానికి కూడా అధికారులు, సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఇటీవల కాలంలో ఈ సంస్కృతి విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తోంది. వేలల్లో పెద్ద మొత్తం ఇచ్చినా కూడా సరిపోవడం లేదు. మా సంతకంతో ఎంత లాభపడితే.. లంచాలను కూడా అదే స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారులకు లంచాలు ఇవ్వడం తప్పనే విషయం తెలిసినప్పటికీ, గత్యంతరం లేని సమయంలో బాధితులు అధికారుల డిమాండ్‌కు తలొగ్గాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో లంచం ఇచ్చే వాళ్లు కూడా కోట్ల రూపాయలు సెటిల్మెంట్‌కు అంగీకరించి, ఆ తర్వాత అనుకున్న మొత్తం ఇవ్వలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను కాజేద్దామని అనుకున్న వాళ్లంతా అధికారులతో పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకుంటున్నారు. ఆ తర్వాత మిగతా సొమ్మును ఇవ్వలేక అధికారులను ఏసీబీకి పట్టిస్తున్నారు. షేక్‌పేట ఆర్ఐ నాగర్జునరెడ్డి రూ.30 లక్షలు, కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10 కోట్లు, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఎకరానికి కోటి రూపాయలు చొప్పున రూ.1.12 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు ఏసీబీ దాడుల్లో వెలుగులోకి వచ్చాయి. అయితే, లంచం తీసుకుంటున్న సమయంలో డబ్బు కట్టలు చూసిన అధికారులకే కండ్లు బైర్లు కమ్మాయి. ఇలా లంచాలు తీసుకునే అధికారులు కూడా ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా భారీ ఎత్తున లంచాలను పుచ్చుకుంటున్నారు.

ఆ రెండింటి మధ్యనే పోటీ..

ఏసీబీ విభాగం అధికారులు చేపట్టే దాడుల సమయంలో అత్యధికంగా రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులే అత్యధికంగా లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. రెండేళ్లుగా ఈ శాఖలు ఏసీబీ వలలో చిక్కుకుంటూ అవినీతిలో పోటీపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2018లో మొత్తం 139 కేసులు నమోదు కాగా, అందులో రెవెన్యూ శాఖకు చెందిన వారు 37 మంది, పోలీసు శాఖకు చెందిన వారు 20 మంది ఉన్నారు. ఆ తర్వాత వరుసలో మున్సిపల్ శాఖ అధికారులు 15 మంది, విద్యుత్ శాఖ వారు 13 మంది ఉండగా, 2019లో మొత్తం 173 కేసులు నమోదు కాగా, రెవెన్యూ శాఖకు చెందిన వారు 54, పోలీసు శాఖలో 18 మంది, మున్సిపల్ లో 25 మంది, విద్యుత్ శాఖలో 10 మంది ఉన్నారు. ఈ ఏడాది 2020లో ఇప్పటి వరకూ మొత్తం 67 కేసులు మాత్రమే నమోదు కాగా, అందులో పోలీస్ శాఖ 14 గురు, రెవెన్యూ శాఖ 11 మంది, ఆ తర్వాత మున్సిపల్, విద్యుత్ శాఖలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రెండేళ్ల కంటే కేసులు సంఖ్య తక్కువైనప్పటికీ, లంచావతారుల వద్ద దాడుల సమయంలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు లభ్యం కావడం గమనార్హం.

ఏడాది కేసుల నమోదు
2018 139
2019 173
2020 67

ఆత్మహత్యలతో విమర్శలు..

ఈ ఏడాది ఏసీబీ కేసులు నమోదు కావడం ఒక ఎత్తయితే, ఆ కేసులలో అనేక మలుపులు తిరగడం మరో ఎత్తు. ఈ కేసులలో నిందితులుగా ఉన్న పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఒకే కేసులో కీసర తహసీల్దార్ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి బెయిల్ పై వచ్చిన అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనల కంటే ముందు షేక్‌పేట తహసీల్దార్ భర్త ప్రొ.అజయ్ భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఏసీబీ అధికారుల ఒత్తిడి కారణంగానే ఈ ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్టు విమర్శలు కూడా వచ్చాయి. వాస్తవానికి వీరు పట్టుబడిన కేసులు చిన్నవేమీ కావు. వీటిలో తహసీల్దార్ నాగరాజు భార్య తన భర్త ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని చంచల్ గూడ జైలు అధికారులపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ధర్మారెడ్డి చెట్టుకు ఉరి వేసుకున్నప్పుడు కూడా 80 ఏండ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవడమేంటనే సందేహాలు వచ్చాయి. మొత్తం మీద ఈ కేసులను నీరుగార్చడంలో భాగంగానే ఆత్మహత్యలు అనే వాదనలు కూడా వచ్చాయి. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య జరిగినా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. మన అధికారులు అవినీతిని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఇటీవల మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తులు దాదాపు రూ.40 కోట్లు, కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ వద్ద రూ.2 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది.



Next Story

Most Viewed