రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు..

by  |
రేవంత్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : సచివాలయం కూల్చివేత పనులపై ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని ఎన్‌జీటీ ఏర్పాటుచేసిన జాయింట్ కమిటీ స్పష్టంచేసింది. పలు దఫాలు విచారణ జరిగిన అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసిన వివరాలను ఎన్జీటీకి నివేదిక రూపంలో సమర్పించింది. రెండురోజుల క్రితం జరిగిన విచారణ సందర్భంగా నివేదిక అంశాన్ని ప్రస్తావించిన గ్రీన్ ట్రిబ్యునల్ తన అభిప్రాయాలు, నివేదికను పిటిషనర్‌కు అందించింది. ఆ నివేదికను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సచివాలయం కూల్చివేత పనుల ద్వారా పరిసర ప్రాంతాల్లో పర్యావరణం కాలుష్యమవుతుందని, హస్సేన్ సాగర్‌కు ప్రమాదం ఉందని ఎంపీ రేవంత్ గతేడాది ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ.. జాయింట్ కమిటీని ఏర్పాటుచేసింది.

ఇందులో సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి పీసీసీఎఫ్ శోభ, చెన్నై రీజనల్ ఆఫీస్ సైంటిస్ట్ ఎంటీ కరుపయ్య, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జేసీఈఈ సీవై నాగేష్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ శశిధర్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్ట్ పూర్ణిమ ఉన్నారు. కమిటీ సభ్యులు గతేడాది సెప్టెంబర్ 10న శిథిలాల తొలగింపు ప్రక్రియను దగ్గరి నుంచి పరిశీలించారు. కూల్చివేత పనులను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నట్లు ఆర్అండ్ బీ అధికారులు కమిటీకి వివరించారు.

సచివాలయ కూల్చివేత శిథిలాలు సుమారు 1.14 లక్షల టన్నుల మేర వస్తున్నాయని, జీడిమెట్లలోని డంపింగ్ యార్డు ఇలాంటి శిథిలాల నుంచి పుట్‌పాత్‌లపై వాడే ఇటుకలను తయారుచేస్తున్నట్లు పేర్కొంది. హుస్సేన్ సాగర్ 80 మీటర్ల దూరంలో ఉందని, మధ్యలో నాలుగు రోడ్ల నెక్లెస్ రోడ్ ఉండగా కూల్చివేత పనులు, శిథిలాల తొలగింపు ప్రక్రియలో ఎలాంటి ప్రమాదం జరగదని పేర్కొంది. సచివాలయ కూల్చివేత, శిథిలాల తొలగింపు పద్ధతి ప్రకారమే జరుతోందని, పర్యావరణానికి ప్రమాదమేమీ లేదని తేల్చిచెప్పింది.


Next Story