పీసీసీ చీఫ్‌గా రేవంత్ ? అందుకే మౌనమా !

by  |
పీసీసీ చీఫ్‌గా రేవంత్ ? అందుకే మౌనమా !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌గా అనుముల రేవంత్‌రెడ్డి పేరు ఖరారైందా? టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై వారంరోజులుగా కసరత్తు చేస్తున్న హైకమాండ్.. రేవంత్‌ పేరునే ఫైనల్ చేసిందా! ఇక రాష్ట్రంలో పార్టీ బతకాలంటే రేవంతే సరైన నాయకుడని సోనియా, రాహుల్ ఓ నిర్ణయానికి వచ్చారా? ఎంతమంది అసమ్మతి రాగాలు వినిపించినా పీసీసీ పీఠం రేవంత్‌‌రెడ్డినే వరించనుందా? ఈ మేరకు రేవంత్‌‌రెడ్డికి ఏఐసీసీ వర్గాల ద్వారా సమాచారం వచ్చిందా ! అంటే అవుననే అభిప్రాయాలు హైదరాబాద్ గాంధీభవన్ వర్గాల ద్వారా వెల్లడవుతున్నాయి.

కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ బాధ్యతలు తీసుకున్న రేవంత్‌ కొద్దిరోజులకే పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రతి విషయంలో పీసీసీ చీఫ్ కంటే ఒక అడుగు ముందుకేసి, కేసీఆర్‌ను కాంగ్రెస్‌లో తనకంటే ఎక్కువ ఎవరూ తిట్టలేరన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల్లో కలిగించారు. ఇదేక్రమంలో పీసీసీ పదవిని తనకే అప్పగిస్తారన్న ప్రచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకుముందు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించినపుడు కూడా పలు వేదికలపై తనదైన స్టైల్లో ప్రసంగాలు చేసి కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి అయితేనే ఢీకొట్టగలడు అన్న నమ్మకాన్ని హైకమాండ్‌లో కలిగించారు. దీంతో రాష్ట్రంలో ఎప్పుడు పీసీసీ పీఠం అంశం ప్రస్తావన వచ్చినా రేవంత్‌రెడ్డి చుట్టూనే తిరగడం ఇప్పటికీ చెప్పుకోదగ్గ విషయం.

రేవంత్‌రెడ్డికి పీసీసీ అప్పగించాలని హైకమాండ్ దృష్టిలో ఎప్పట్నుంచో ఉన్నా పార్టీలో సీనియర్ల నుంచి వ్యతిరేకత రావడంతో రెండేళ్లుగా ఆ విషయాన్ని నాన్చుతున్నారు. అయితే మొన్న దుబ్బాక, నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం, పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో ఇక ఏ పరిస్థితులు అడ్డువచ్చినా సర్దుకొని, ఎవరో ఒకరికి పీసీసీ పగ్గాలు అప్పగించాల్సిన పరిస్థితి హైకమాండ్‌‌కు వచ్చింది. ఈ క్రమంలో గ్రేటర్‌ ఎన్నికలకు ముందే రేవంత్‌రెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తారని ప్రచారం జరిగినా.. ఫలితాల తర్వాత తీసుకుంటానని ఆయన చెప్పడం వల్లే ఆపారని, పైగా ఇప్పుడు ఉత్తమ్ రాజీనామా చేయడం రేవంత్‌కు కలిసి వచ్చిందన్న అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినపడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్యం ఠాగూర్ నియమించబడ్డ కొద్దిరోజులకే రేవంత్‌రెడ్డే పీసీసీ చీఫ్‌ అన్న విషయం పార్టీలో తెలిసిపోయిందని, కొద్దిరోజులుగా సీనియర్లను బుజ్జగించేందుకే డీలే చేస్తున్నారన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇదేక్రమంలో పీసీసీ పీఠాన్ని దక్కించుకోవాలనుకుంటున్న ఆశావహులు సైతం మీడియా ముందుకొచ్చి తమ మనసులో మాట చెబుతున్నా.. తనకు ఎప్పుడో పదవి కన్ఫామ్ అయినందునే మీడియాలో గానీ, ఇతర అనుచరులతో గానీ రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని పంచుకోవడం లేదన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. అసలు విషయాన్ని మదిలో పెట్టుకొనే.. రేవంత్‌ ఎలాంటి తొణుకు, బెణుకు లేకుండా అందరితో ఫ్రీగా ఉంటూ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారన్న ఊహాగానాలు మీడియా వర్గాల్లో స్పష్టమవుతోంది.

జాతీయ కాంగ్రెస్‌లో కీలక నేత అయిన డీకే శివకుమార్.. రాహుల్ గాంధీ సూచన మేరకు రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను రిపోర్టుగా తయారు చేసి తీసుకెళ్లిన మాణిక్యం ఠాగూర్‌.. ఇవాళో రేపో రేవంత్‌రెడ్డి పేరును ప్రకటిస్తారన్న సంకేతాలు రేవంత్ అనుచరుల నుంచే వినపడుతుండటం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

Next Story

Most Viewed