పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే!

by  |
పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే!
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు జూన్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కేవలం పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వీలుగా ఇవి తెరుచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు జూలై 5వ తేదీ వరకు జరగనున్నప్పటికీ గురుకుల విద్యా సంస్థలు మాత్రం జూన్ 30 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. మళ్ళీ వాటిని పూర్తిస్థాయిలో ఎప్పుడు తెరవాలనేదానిపై ఆ తర్వాత నిర్ణయం జరుగుతుంది. జూన్ 30 తర్వాత సంస్కృతం, ఓరియంటల్ లాంగ్వేజీలు, ఒకేషనల్ కోర్సుల లాంటి పరీక్షలే ఉన్నందున గురుకుల విద్యా సంస్థల్లో ఈ పరీక్షలు రాసే విద్యార్థులు దాదాపు లేరని సమాచారం. అందువల్లనే జూన్ 30వ తేదీ వరకు మళ్ళీ మూసేయాలని అనుకుంటున్నారు నిర్వాహకులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు 12,163 మంది ఉండగా మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మాత్రం 4,800 మంది ఉన్నారు. పరీక్షలు ప్రారంభం కావడానికి వారం రోజుల ముందే పాఠశాలలను తెరిచి వారికి చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. అయితే కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


Next Story