ఆదిలాబాద్‌లో నిండుకుండల్లా రిజర్వాయర్లు

by  |
ఆదిలాబాద్‌లో నిండుకుండల్లా రిజర్వాయర్లు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జిల్లాలోని సాగునీటి జలాశయాలకు వరదనీరు పోటెత్తింది. దీంతో అన్ని ప్రాజెక్టులు నిండాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వాగుల్లోకి వదులుతుండగా… మిగిలిన ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి పెరుగుతోంది.

ప్రాజెక్టులకు భారీ వరద

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని కుమ్రం భీం(అడ) ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ప్రాజెక్టు నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 242 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 10.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండు గేట్లు ఎత్తి నీటిని పెద్ద వాగులోకి వదులుతున్నారు.

అలాగే ఇదే జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్టు నీటిమట్టం 239.5 మీటర్లు కాగా ప్రస్తుతం 238.5 మీటర్ల నీరు నిల్వ ఉంది. ఒక్క గేటును ఎత్తి నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు నీటి మట్టం 356 మీటర్లు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. ఈ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు నీరు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిందని అధికారులు తెలిపారు.

మరోవైపు సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1194 అడుగులు కాగా ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండగా ఒక గేట్​ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు సైతం పూర్తి స్థాయిలో నిండింది. ఎర్ర వాగు, చెలిమెల ప్రాజెక్టుల్లోకి కూడా భారీగానే వరద నీరు వచ్చి చేరుతున్నది.

ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడి వాగు, బోథ్ ప్రాజెక్టులకు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వానాకాలం సీజన్ లో పండించే పంటలకు తోడు ప్రాజెక్టుల కింద వచ్చే వేసవిలోనూ పంటలకు ఢోకా లేదని రైతులు సంబరపడుతున్నారు.

ఎస్సారెస్పీకి భారీ వరద

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కూడా భారీగానే వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1,083 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. జలాశయంలో 58 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు, గోదావరి క్యాచ్ మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్సాలతో ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఇది ఉత్తర తెలంగాణ జిల్లాల రైతాంగానికి సంతోషకరమైన వార్త అని అధికారులు చెబుతున్నారు



Next Story

Most Viewed