ఎంపీలను ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్రు.. ఏమనంటే..?

by  |
ఎంపీలను ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్రు.. ఏమనంటే..?
X

“మా ఎంపీని చూడక ఎనిమిది నెలలు దాటింది. వ్యాపారమే ముఖ్యమంటూ ముఖం చాటేస్తున్నరు. ఒక్కసారైనా వచ్చిపోవే. అని అడిగితే, వచ్చి ఏం చేయాల్నే అని ఎదురు ప్రశ్నిస్తున్నరు. ఇక లాభం లేదని మేం అడగడమే బంద్ చేసినం” ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన ఇది.

“పదవి ఉంటే ఏదో చేస్తరనుకుంటే మొక్కలకు, ఫైరవీలకూ పరిమితమవుతున్నరు. అవసరం ఉంటేనే ఫోన్ చేస్తరు. మేం ఫోన్ చేస్తే మళ్లీ చేస్తమంటరు. పెద్ద సారు దగ్గరకు పోయి చెప్పుకుందామంటే వీళ్లను దాటి అక్కడకు పోవడమే కుదరదు. భూములు కబ్జా చేసేటోళ్లు, దందాలు చేసేటోళ్లు అంతా వాళ్ల దగ్గర్నే ఉంటున్నరు” రాజ్యసభ సభ్యుల గురించి రాజధాని శివారు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే బాధ ఇది.

“నియోజకవర్గాలకు పోయి ఏం చేయాలే. మంత్రులు మమ్మల్ని పట్టించుకోరు. ఒకవేళ పోయినా మా దగ్గరకు వచ్చేటోళ్లే కనిపించరు. మీ తోని ఏం పని అయితది? మీ చుట్టూ తిరిగినా లాభం లేదు అంటున్నరు. ఎక్కడికి పోతే పని అయితదో అక్కడకే పోవాలే అంటూ ఓ నలుగురి చుట్టే తిరుగుతున్నరు. మంత్రులు కూడా వాళ్ల దగ్గర నుంచే పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడో పార్లమెంట్ సమావేశాలప్పుడు తప్ప మేం ఉన్నామనే గుర్తింపే లేదు.‘‘ ఇది ఎంపీల మనసులో మాట.

దిశ, న్యూస్ బ్యూరో:
ప్రజల సమస్యల పరిష్కరానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి. ఎమ్మల్యేలు, ఎంపీల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంపీలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని వాపోతు న్నరు ఎమ్మెల్యేలు. జరంత మా నియోజకవర్గం దాకా వచ్చి పోవే అని మొరపెట్టుకున్నా పెడచెవిన పెడుతున్నరని అంటున్నరు. అధికార పార్టీ ఎంపీలు అయితే ఇండ్లకు, వారి సొంత వ్యాపా రాలు, వ్యవహారాలకూ పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నయి. కొందరు విపక్ష ఎంపీలు మాత్రం ప్రజా క్షేత్రంలో తిరుగుతూ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. అధికార పార్టీ ఎంపీలు కరోనా కష్టకాలంలో కూడా ప్రజల మధ్యకు రాలేదు. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన ఎంపీ వ్యాపారానికే పరిమితమయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు సదరు ఎంపీని నియోజకవర్గానికి రావాలని కోరినా ఫలితం లేదు. ఆయన ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకుని ఎంపీగా గెలిచి నియోజకవర్గాన్నే మర్చిపోయారు. అధికార పార్టీ కార్యక్రమాలకూ దూరంగానే ఉంటున్నారు. కొందరు హైదరాబాద్ వంటి ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. సొంత పనులు మినహా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో అసలే కనిపించడం లేదు. గతంలో నియోజకవర్గాల్లో తిరగకుండా ఇండ్లకు, ఢిల్లీకి పరిమితమైన రికార్డును సొంతం చేసుకున్న ఎంపీల కంటే ఇప్పడున్న ఎంపీల వైఖరి భిన్నంగా ఏమీ లేదని అంటున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరిదీ ఇదే తీరు. కరోనా వేళ కూడా పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలవారు ఏవేవో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అన్నదానాలు, నిత్యావరస వస్తువులు పంపిణీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పార్లమెంట్ సభ్యుల ముఖాలు కనిపించలేదు. కరోనా జాగ్రత్తలంటూ ఇండ్లకు పరిమితమయ్యారు.

ఇందుకేనా పదవులు..?

అధికార పార్టీ నేతలే కొంతమంది ఎంపీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉండి కూడా అక్కరకు వచ్చే పనులకు దూరంగానే ఉంటున్నారని బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ప్రభుత్వం ఓ వైపు హరితహారం కార్యక్రమం చేపడుతున్నా, ఛాలెంజ్‌లంటూ, మొక్కల పెంపకాలంటూ వెంట పడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొక్కల పెంపకం మంచి కార్యక్రమమే అయినా, అది తప్ప మరెలాంటి కార్యక్రమాలు చేయడం లేదని మండిపడుతున్నారు. కనీసం సభల్లోనూ మాట్లాడకుండా కాలం వెళ్లదీస్తున్న ఎంపీలున్నారని వాపోతున్నారు. ఇలాంటివారికి కూడా రాజ్యసభ పదవులు కట్టబెట్టి పదవులకు విలువ లేకుండా చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు కొంత బెటర్‌గా ఉన్నారు. కరీంనగర్ ఎంపీ సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై తరచూ ఆందోళన బాట పడుతున్నారు. అప్పుడప్పుడూ జనాల్లో కనిపిస్తున్నారు.

తిరిగి మేమేం చేయాలే?

ఎంపీల మనోగతం మాత్రం వేరేగా ఉంది. అధికార పార్టీ ఎంపీల్లో ఓ రకమైన నైరాశ్యం నెలకొంది. తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే భావన వారిది. రాష్ట్రంలో ఎలాంటి పనులు జరగాలన్నా నలుగురైదుగురిని కలిస్తే చాలు అని వారు అభిప్రాయపడుతున్నారు. వారితోనే పనులు జరిగిపోతాయని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు అందరికీ తెలిసి వచ్చిందం టున్నారు. దీంతో కొంతమంది ప్రగతి భవన్ చుట్టూ, అక్కడ ఫైరవీలు చేసే వారి చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, నియోజకవర్గాల్లో తిరిగి మేమేం చేయాలని ప్రశ్నిస్తున్నారు. తమ వద్దకు వస్తే ఏ పనీ కావడం లేదని నేతలకు, కార్యకర్తలకు స్పష్టంగా తెలిసిపోయిందని, దీంతో తాము పర్యటనలకు వెళ్లినా ఆదరణ ఉండటం లేదని కొందరు ఎంపీలు ‘ఆఫ్ ది రికార్డ్’లో చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఏదైనా పని కావాలంటే ఆ నలుగురైదుగురి దగ్గరకు వెళ్తేనే ఫలితం ఉంటుందనే విషయం సామాన్య జనం మొదలుకుని వ్యాపార వర్గాలు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల వరకు తెలిసేలా చేశారని, దీంతో తమకేం ప్రాధాన్యం ఉండటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.



Next Story

Most Viewed