ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్రకు కష్టాలు

by Disha Web Desk 17 |
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్ యాత్రకు కష్టాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో సాధారణ ప్రజానీకం తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా అల్మోరా, ఉత్తరకాశీ, బాగేశ్వర్ జిల్లాల్లో భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ జిల్లాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది, అలాగే రోడ్లపై కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అల్మోరా-కౌసానిలోని చానోద్ మార్కెట్‌లో సుమారు అర డజను వాహనాలు నిలిచిపోయాయి. ఈ రహదారిని పూర్తిగా మూసివేశారు. లోతట్టు దుకాణాలు, ఇళ్ళు నీటి ద్వారా వచ్చిన చెత్తతో నిండిపోయాయి. మే 13 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండలపైకి వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.

మరోవైపు ప్రతిష్టాత్మకమైన చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా యాత్రికులకు ఇబ్బందులు తలెత్తాయి. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో చాలా మంది రాష్ట్రానికి చేరుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయిన వాతవారణంతో యాత్రికులకు కష్టాలు తప్పేలా లేదు. వర్షాల కారణంగా గురువారం ఉదయం వరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వాటిలో చాలా వరకు అదుపులోకి వచ్చాయి. కానీ కొన్ని చోట్ల ఇంకా ఉన్న మంటలు ఈ వర్షంతో పూర్తిగా ఆరిపోయాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విపత్తుల నివారణ, అలాగే చార్ ధామ్ యాత్ర నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాఖండ్‌ అడవుల్లో మంటలు చెలరేగడంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పర్యావరణాన్ని కాపాడేందుకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరింది.



Next Story

Most Viewed