ఒకే రోజు ఐదుగురు హత్య.. చంపడమే పరిష్కారమా..?

by  |
murders
X

దిశ, వెబ్‌డెస్క్ : బంధాలు అనుబంధాలు రోజురోజుకు కరువైపోతున్నాయి. రక్త సంబంధాలు కనుమరుగవుతున్నాయి. అమ్మ, నాన్న, అక్క, అన్న, తోబుట్టువులు, బంధువులు అనే తేడా లేదు. అడ్డమొస్తే అంతం చేయడమే అన్నట్లుగా మారింది నేటి సమాజం. సోమవారం ఒక్కరోజే ఐదుగురు రక్త సంబంధీకులను కర్కషంగా హత్యచేశారు తోబుట్టువులు. ఆస్తి తగాదా నేపథ్యంలో తల్లిని, తమ్ముడిని హత్య చేశాడో అన్న. అన్న కొడుకులను ఇంట్లో బంధించి చావగొట్టాడో బాబాయ్.. కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న పీక కోశాడో తమ్ముడు. ఇలా రోజుకు పదుల సంఖ్యలో నావాళ్లు అనుకున్న వాళ్లే హత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. భర్తలు, భార్యలు అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగే హత్యలు వీటికి అదనం.

ఆస్తే కావాలి.. అమ్మ, తమ్ముడు వద్దు

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(యస్) మండలం కందగట్ల గ్రామంలో తల్లి, కోడుకు దారుణ హత్యకు గురయ్యారు. వారిద్దరిని మరో కుమారుడే హత్య చేయడం గమనార్హం. తూర్పాటి కృష్ణయ్య,మారెమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు,ఒక కుమార్తె. వీరందరికీ పెళ్ళిలు అయ్యాయి. తండ్రి కృష్ణయ్య రెండేళ్ల చనిపోయాడు. చిన్న కుమారుడు శ్రీనుకు భార్యతో విడాకులు అయ్యాయి. దీంతో చిన్న కుమారుడు తూర్పాటి శ్రీను(30) తల్లి మారెమ్మ(75) కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఐదో కుమారుడు లక్ష్మయ్య, చిన్న కుమారుడు శ్రీనులు కలిసి గాంధీనగర్ వద్ద ఇంటి ప్లాట్ ను కొనుగోలు చేశారు. అయితే ఇటీవల లక్ష్మయ్య ఆ ప్లాటును శ్రీనుకు తెలియకుండా విక్రయించుకున్నాడు. విషయం కాస్త శ్రీనుకు తెలియడంతో ఇరువురి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీను వ్యవసాయ భూమివద్దకు వెళ్ళాడు. లక్ష్మయ్య భూమినుండి శ్రీను భూమిలోకి నీళ్లు వస్తుండగా.. నా భూమిలోకి నీళ్లు రానియ్యవొద్దని ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ గొడవ పడ్డారు. అదే సమయంలో లక్ష్మయ్య భార్య పదునైన భరిసేను తీసుకోచ్చి భర్తకు అందించింది. అప్పటికే ఆవేశంతో ఉన్న లక్ష్మయ్య శ్రీనును విచక్షణ రహితంగా భరిసేతో పొడితాడు. అడ్డుపడిన తల్లిని సైతం పొడవడంతో ఇద్దరు అక్కడికక్కడే హతమయ్యారు.

వదిన కొడుకులను కొట్టి కొట్టి చంపేశాడు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండేటి కోటేశ్వరరావు, ఉమాదేవి దంపతులిద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు పార్థివ్ సాహసవత్(10), రోహిత్ తశ్విన్(8)లు రేపల్లెలోని నేతాజీ నగర్ లో ఉన్న అమ్మమ్మ వద్దకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా పిల్లలిద్దరూ అమ్మమ్మ విజయలక్ష్మి వద్దే ఉంటున్నారు. ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు విజయలక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి పిల్లలిద్దరిని అతి దారుణంగా హత్య చేశాడు.లాక్ డౌన్ వల్ల చాలాకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అన్నను పీకకోసి చంపిన తమ్ముడు

విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ దేముడువలస గ్రామంలో గత కొద్ది రోజులుగా అన్నదమ్ములైన వేముల వాసుదేవ్, వేముల జగన్నాథం మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూములను పంచుకొనే విషయంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి వేముల జగన్నాథం అన్న వేముల వాసుదేవ్( 30)ను పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.

ఈ ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. నిత్యం తోబుట్టువుల చేతుల్లో అయిన వాళ్ల రక్తం పారుతోంది. పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేం అని తెలిసినా ఉండే నాలుగు రోజుల జీవితానికి ఆ నలుగురిని దూరం చేసుకుంటున్నారు. ఓ వైపు కరోనా వచ్చి అయిన వాళ్లను కళ్ల ముందే ఎత్తుకుపోతున్నా.. మనుషులు మారకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

Next Story

Most Viewed