మోడీ ప్రకటన.. తెలంగాణకు తగ్గిన ఆర్థిక భారం

by  |
మోడీ ప్రకటన.. తెలంగాణకు తగ్గిన ఆర్థిక భారం
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో 18 ప్లస్ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో రాష్ట్రానికి సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయల మేర భారం తగ్గినట్లయింది. కేంద్రం ఉచితంగా ఇచ్చినా ఇవ్వకున్నా రాష్ట్రమే అందరికీ ఫ్రీగా టీకాలు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అందరికీ ఉచితంగా ఇవ్వాలంటే దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని ముఖ్యమంత్రి అంచనా వేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా సమకూర్చనన్న నేపథ్యంలో రాష్ట్రానికి ఆ మేరకు ఉపశమనం కలిగినట్లయితే దాదాపు నెల రోజుల పాటు లాక్‌‌డౌన్ కారణంగా ఆర్థిక వనరులు కోల్పోయిన పరిస్థితుల్లో కేంద్రం ప్రకటనతో రాష్ట్రానికి ఆ మేరకు ఆర్థిక భారం తగ్గినట్లయింది.

దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో టీకాల కొరత కారణంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో సెకండ్ డోసు పంపిణీ మాత్రమే జరుగుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుంచి 18 ప్లస్ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించినా రాష్ట్రానికి అందే డోసులకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మళ్ళీ ఊపందుకునే అవకాశం ఉంది. ఈ నెల చివరి వరకూ దేశంలోని భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉత్పత్తి సామర్థ్యం పెద్దగా పెరగకపోవచ్చని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారుల అంచనా. కానీ ప్రధాని ప్రకటన తర్వాత విదేశాల నుంచి ఆస్ట్రాజెనికా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్, ఫైజర్ లాంటి టీకాలను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

లాంఛనంగా ఈ నెల 21 నుంచి దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ఉచితం కానున్నప్పటికీ తెలంగాణలో మాత్రం తగిన మోతాదులో డోసులు చేరుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో జూలై 1వ తేదీ తర్వాతనే కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకూ ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో సెకండ్ డోస్, ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులకు ఫస్ట్ డోస్ లాంటివి కొనసాగనున్నాయి. ఎలాగూ గ్లోబల్ టెండర్లకు స్పందన రాకపోవడంతో కేంద్రంపైన ఆధారపడాల్సిన అనివార్య పరిస్థితుల్లో ప్రధాని స్వయంగా ఉచితం గురించి ప్రస్తావించడం రాష్ట్ర ప్రభుత్వానికి విముక్తి కలిగినట్లయింది.

Next Story

Most Viewed