పాలకొల్లులో భూమి రికార్డు ధర..గజం 2.5 లక్షలు

by  |
పాలకొల్లులో భూమి రికార్డు ధర..గజం 2.5 లక్షలు
X

దిశ వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భూమి రికార్డు ధర పలుకుతోంది. ప్రధాన పట్టణాలకు కూడా అందనంత స్థాయిలో పాలకొల్లులో భూముల ధరలకు రెక్కలు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. భూముల రికార్డు స్థాయి ధరలతో పాలకొల్లు ప్రాంత వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

పాలకొల్లు పట్టణంలో గజం భూమి ధర రూ.2.50 లక్షలు పలికింది. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోని ఈ స్థలాన్ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకోవడం పాలకొల్లులో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి పాలకొల్లులో గజం స్థలం ధర 32 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల మధ్యలో విక్రయించబడుతోంది. పట్టణం నడిబొడ్డున ఉన్న స్థలాలకు కాస్త అటూ ఇటూగా అధిక ధరకు భూములు అమ్ముడవుతూ ఉంటాయి.

అయితే ఆలయానికి సమీపంలో ఉన్న స్థలానికి గజానికి 2.50 లక్షల రూపాయలు వెచ్చించి మరీ సొంతం చేసుకోవడం ఎన్నడూ చోటుచేసుకోలేదు. 200 గజాల స్థలాన్ని ఆ వ్యక్తి రెండుదఫాలుగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మహాత్మాగాంధీ రోడ్డు పక్కనే ఉన్న ఈ స్థలానికి 100 గజాలకు.. గజం 1.75 లక్షల రూపాయలకు కొనుగోలు చేయగా, రెండో 100 గజాలకు..గజం 2.50 లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్టు సమాచారం.

పెద్దనోట్ల రద్దుకు ముందు ఈ ప్రాంతంలో గరిష్ఠంగా గజం 1.25 లక్షల రూపాయలకు అమ్ముడు పోవడం విశేషం. ఇప్పట్లో ఆ ధరకు అక్కడ భూములు కొనుగోలు చేసేవారే కరవయ్యారు. అలాంటి పరిస్థితుల్లో రికార్డు స్థాయి ధరలు చెల్లించి 200 గజాల భూమిని కొనుగోలు చేయడం ఆసక్తి రేపుతోంది. కాగా, పాలకొల్లులో ఈ భూమి ధరలగురించిన గుసగుసలే తప్ప విక్రేతలు, కొనుగోలుదారుకు సంబంధించిన వివరాలు పొక్కకపోవడం విశేషం.

Next Story

Most Viewed