అందుకే ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదా?

by Disha edit |
అందుకే ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకోవడం లేదా?
X

ప్రభుత్వ విద్యను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం యూనివర్సిటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఎక్కువగా ఉండి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినవారే కావడం, అక్కడ చదివే విద్యార్థులలో ఎవరూ పాలకవర్గాల వారికి సంబంధించిన వారు లేకపోవడం కారణాలుగా పేర్కొనవచ్చు. ప్రస్తుత యూనివర్సిటీలు కేవలం ప్రభుత్వ కొలువుల ప్రిపరేషన్ కొరకు ఉపయోగపడతాయే తప్ప, ఎటువంటి తరగతులు గానీ, పరిశోధనలు గానీ, చర్చలు గానీ, సదస్సులు గానీ, సమావేశాలు గానీ కనీసంగా నిర్వహించడం లేదు. బంగారు తెలంగాణలో ప్రభుత్వ విద్యా భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా, అగమ్యగోచరంగా, ఆందోళన కలిగించే విధంగా మారిందనడంలో సందేహం లేదు.

దేశంలో ఒక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు 60 యేండ్లు అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ గడ్డ తెలంగాణ. ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఆవిర్భావం నుంచి ఉద్యమ నినాదాలుగా ఉన్నవి నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడినాక నియామకాలు మాత్రం చేపట్టడం లేదు. ఉద్యమ సమయంలో 'మన వర్సిటీలను ప్రపంచ మేటి వర్సిటీల సరసన నిలిచే విధంగా తయారు చేసుకుందాం' అని ఊహలలో ముంచెత్తారు. ఇప్పుడు కనీసం ఉమ్మడి రాష్ట్ర పాలకులు అందించిన బడ్జెట్ కూడా యూనివర్సిటీలకు కేటాయించని అవమానకర పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోంది.

Also read: వందేళ్ళ చరిత్ర ఉన్న సిటీ కాలేజ్ గురించి తెలుసా

పోస్టులన్నీ ఖాళీగా

రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు దాటింది. నేటికీ వర్సిటీలలో ఒక్క పోస్టు కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ కాలేదు. అన్ని యూనివర్సిటీలలో దాదాపు 2,979 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా 2,152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే, దాదాపు మూడొంతుల వంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఈ 75 శాతం ఖాళీలలో ఒకే ఆచార్యుడితో నెట్టుకొస్తున్న శాఖలూ ఉన్నాయి. రిటైరైపోయే వారే తప్ప వచ్చే వారు లేక యూనివర్సిటీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నాయి.

60 యేండ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి(osmaina university) వంద సంవత్సరాలు నిండాయి. ఇక్కడ 1,280 మంది ప్రొఫెసర్లు ఉండాలి. 352 మంది మాత్రమే ఉన్నారు. 955 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియా వర్సిటీలోనే ఇన్ని ఖాళీలు ఉంటే రాష్ట్రంలో ఉన్న మిగతా వర్సిటీల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. తెలంగాణ విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ఎంతగా కుంటుపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యూనివర్సిటీలను కేంద్రంగా చేసుకొని గ్రామీణ ప్రాంత యువతను ఉసిగొల్పిన నేటి పాలకులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నేడు గొంగలిపురుగైంది. ఉద్యమ హామీలకు అణుగుణంగా వర్సిటీలను బాగు చేయాల్సిన బాధ్యతను గుర్తెరగాలి.

వారే ఎక్కువగా ఉండటంతో

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ విద్యను సర్వ నాశనం చేయాలనుకుంటున్నారు. అందుకే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని నినదించినవారు నేడు గ్రామీణ ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ వరకు అన్నింటినీ ఎత్తివేస్తే, కొన్నింటిని నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల ప్రణాళికలు అమలు చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తమ అనుయాయులచే ఐదు 'ప్రైవేటు యూనివర్సిటీ'లు ఏర్పరచి ఉన్నత విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర మొదలైంది.

ప్రభుత్వ విద్యను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం యూనివర్సిటీలలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఎక్కువగా ఉండి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారే కావడం, అక్కడ చదివే విద్యార్థులలో ఎవరూ పాలకవర్గాల వారికి సంబంధించిన వారు లేకపోవడం కారణాలుగా పేర్కొనవచ్చు. ప్రస్తుత యూనివర్సిటీలు కేవలం ప్రభుత్వ కొలువుల ప్రిపరేషన్ కొరకు ఉపయోగపడతాయే తప్ప, ఎటువంటి తరగతులు గానీ, పరిశోధనలు గానీ, చర్చలు గానీ, సదస్సులు గానీ, సమావేశాలు గానీ కనీసంగా నిర్వహించడం లేదు. బంగారు తెలంగాణలో ప్రభుత్వ విద్యా భవిష్యత్తు అత్యంత ప్రమాదకరంగా, అగమ్యగోచరంగా, ఆందోళన కలిగించే విధంగా మారిందనడంలో సందేహం లేదు.

Also read: పుస్తకాలు లేకుండా చదువులా?


కె. రమేశ్‌‌యాదవ్‌

విద్యార్థి జన సమితి అధ్యక్షుడు

ఓయూ తెలుగు శాఖ

78932 85131

Next Story

Most Viewed