ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలం మరో మూడేళ్లు పొడిగింపు!

by  |
ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ పదవీకాలం మరో మూడేళ్లు పొడిగింపు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను మరో మూడేళ్ల పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2018లో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా అనంతరం దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది డిసెంబర్ 10తో శక్తికాంత దాస్ పదవీకాలం ముగియనుంది. గత మూడేళ్ల కాలంలో దాస్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థికవ్యవస్థ వృద్ధికి చాలా కీలకంగా మారాయి. నోట్ల రద్దు నుంచి విదేశీ మారకపు నిల్వల వరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కొవిడ్-19 మహమ్మారి సంబంధిత సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పటికీ కరోనా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థ వృద్ధి కోసం దాస్‌ పదవీకాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించారు. 2020లో కరోనా సంక్షోభంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయి. వ్యవస్థలో ద్రవ్యలభ్యత సమస్యను పరిష్కరించేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. వడ్డీ రేట్లను తగ్గించేందుకు ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించారు. ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలకు మద్దతుగా ఆర్‌బీఐ నుంచి సరైన విధానంలో మారటోరియం అమలు, ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి మినహాయింపులు ఇచ్చారు. ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్న ఈ కారణాలతోనే దాస్ సేవలు ఆర్థికవ్యవస్థకు అవసరమని భావించిన కేంద్రం అతడి పదవీకాలాన్ని పొడిగించింది.



Next Story

Most Viewed