ధరణిలో అవకతవకలకు అవకాశం లేదు : కలెక్టర్ అమోయ్ కుమార్

by  |
Rangareddy Collector Amoy Kumar
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెవెన్యూ భూములే వివాదంగా ఉన్నాయి. ఈ భూములను పరిష్కారించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ ప్రత్యేక కార్యచరణ రూపొందించి, నెలరోజుల్లో పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను గ్రామాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలతో పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్‌తో ‘దిశ’ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమోయ్ కుమార్ జిల్లా ప్రజలు ధరణి ఫోర్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దిశ ప్రతినిధి: ధరణితో సమస్యలు పెరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు…?
కలెక్టర్ : ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్‌గా ఉంది. వివక్షలేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి నాన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోంది.
దిశ ప్రతినిధి : రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. ఏఏ అంశాలపై, ఎన్ని పరిష్కరించారు.
కలెక్టర్ : రంగారెడ్డి జిల్లాలో 27,963 పెండింగ్ మ్యూటేషన్లు, 19,442 భూమి సంబంధిత విషయాలపై 4294 నిషేధించబడిన జాబితాలోనివి. 6243 కోర్ట్ కేసులు వంటి ఫిర్యాదులను పరిష్కరించాము. జిల్లాలో అందిన ఫిర్యాదుల్లో 90శాతంపైగా పరిష్కారమైయ్యాయి.
దిశ ప్రతినిధి: జిల్లాలో ఇప్పటి వరకు ధరణితో ఎన్ని లావాదేవీలు జరిగాయి.
కలెక్టర్ : విక్రయాలు కింద 61,289, గిఫ్ట్ డీడ్ కింద 7,518, వారసత్వం కింద 4,571 చొప్పున లావాదేవీలు జరిగాయి. జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోంది. ధరణిని సమర్థవంతంగా అమలు చేయడంలో సహచర అధికారులు, తహసీల్దార్లు, మండల అధికారులు పనిచేస్తున్నారు. ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయి. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండేవి కావు. ఇప్పుడు జిల్లాలో ప్రతి తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయి. ధరణి ప్రారంభానికి ముందు దీనికి గంటలు, గంటల సమయం పట్టేది. గతంలో తక్కువగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల కోసం ఎంతోమంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవి.
దిశ ప్రతినిధి : ధరణిలో అన్నింటికి సంబంధించిన ఆప్షన్లు ఉన్నాయా…?
కలెక్టర్: టాంపర్ ప్రూఫ్, పౌరులకు అనువుగా ఉండడం, తక్షణమే రిజిస్ట్రేషన్‌తోపాటు వెంటనే మ్యూటేషన్ జరిపే సౌకర్యం, పారదర్శకత, ఆధునిక సాంకేతికత వినియోగం, వివక్షకు తావులేకుండా ఉండడం, అతితక్కువగా అధికారుల జోక్యం వంటివి ధరణిలో ప్రత్యేకతలు. అంతేగాకుండా అడ్వాన్స్‌గా స్లాట్ బుకింగ్ సౌకర్యం, బయో మెట్రిక్ నిర్ధారణ, ప్రతీ సర్వే నెంబర్‌కు మార్కెట్ విలువ నిర్ధారణ, రిజిస్ట్రేషన్లతోపాటే మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తం ఆటోమేటిక్‌గా నిర్ధారణ సౌలభ్యం, ఆన్లైన్ చెల్లింపులు, అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ, పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం పంపిణీ, నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం వంటి ఆప్షన్లు ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయి.
దిశ ప్రతినిధి: అవకతవకలకు అవకాశం లేదా..? రంగారెడ్డి జిల్లా రెవెన్యూలో ఆరోపణలు వస్తున్నాయి.
కలెక్టర్ : ధరణి ఫోర్టల్ వచ్చిన తర్వాత అవకతవకలకు అవకాశం లేదు. ఎందుకంటే ప్రతీ అంశం పరిగణలోకి తీసుకొని, క్షేత్రస్ధాయి పరిశీలన తర్వాతనే ఆమోదం, తిరస్కరణకు గురైతుంది. ఆప్షన్‌కు విరుద్ధంగా ఏ అధికారికైనా పనిచేసే అధికారం లేదు. రంగారెడ్డి జిల్లాలో నిబంధనలకు లోబడే రెవెన్యూ పనులు జరుగుతాయి. ధరణిలో బాధితులు దరఖాస్తు చేసుకుంటే పూర్తిస్థాయిలో విశ్లేషించి ముందుకు వెళ్తాము.



Next Story

Most Viewed