కాస్త ఉపశమనం.. కానీ, మరో 2 రోజుల్లో..

by  |
కాస్త ఉపశమనం.. కానీ, మరో 2 రోజుల్లో..
X

దిశ, న్యూస్ బ్యూరో: నాలుగు రోజులుగా ముసుగేసిన ముసురు ఎట్టకేలకు కొన్ని జిల్లాల్లో తెరపిచ్చింది. దీంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. సోమవారం ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సగుటగా 3 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, మిగతా అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదు. వర్షంతో ప్రధానంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో అధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇండ్లు కూలిపోగా బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం చాలా ప్రాంతాల్లో వర్షం కురువకపోవడంతో ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో గిరిజన గ్రామాలకు ఇంకా రాకపోకలు మొదలుకాలేదు.

రైతుకు ఆదిలోనే కష్టాలు..

ఈసారి రైతు పంటల నష్టం ముందుగానే చవిచూడాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 62,500 ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. సోమవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయని, పరిశీలనకు ఎవరూ రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాథమిక సర్వే ప్రకారం 50 వేల ఎకరాల్లో వరి, 12,500 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో 10 వేల ఎకరాల్లో వరి, 2500 ఎకరాల్లో పత్తి పంటలు నీటమునిగాయి. ఖమ్మం జిల్లా గార్ల మండలంలో 800 ఎకరాలు, కొత్తగూడ మండలంలో 300 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 300 ఎకరాలు, డోర్నకల్ మండలంలో 2500 ఎకరాలు, వరి పంట దెబ్బతింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్‌లో 7వేల ఎకరాల్లో వరి, 2 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. కానీ చాలా జిల్లాల్లో పత్తి పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. పత్తిలో నీళ్లను డ్రైన్ చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో అది సాధ్యం కావడం లేదు. ములుగు, కరీంనగర్ జిల్లాల్లో వరి నష్టం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరో రెండు రోజులు వానలు..

ఈశాన్య మధ్యప్రదేశ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా, 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో తెలంగాణలో రాగల రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

Next Story