ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ఎందుకు కడుతున్నారు : బీజేపి ఎమ్మెల్యే రఘనందన్ రావు

by  |
raghunanda
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎవరికి గులాంగిరి చేయడానికి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కడుతున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. బానిసత్వం చేయటానికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం కడ్తున్నట్లు ఆయన ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఢిల్లీలో స్థలం తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ , ఇక్కడ మాత్రం ఇతర పార్టీల కార్యాలయాలకు స్థలం ఇవ్వని కుసంస్కారం తో ఉందని మండిపడ్డారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తమ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రను విమర్శించే నైతికత కాంగ్రెస్ కు లేదన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రను విమర్శించి ప్రజల్లో పలుచన కావొద్దన్నారు. 1996లో బీజేపి పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని అడిగారు. పార్లమెంట్ లో బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదని తేల్చి చెప్పారు. తాను చేయలేని పాదయాత్రను బీజేపీ అధ్యక్షుడు నిర్వహించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు జీర్ణించుకోలేక పోతున్నాడన్నారు. అహంకారంతో మాట్లాడిన నేతలు తప్పనిసరిగా కాల గర్భంలో కలసిపోతారని జోస్యం చెప్పారు. బీజేపి పార్టీపై ఎగిరిపడుతున్న మంత్రి హరీష్ రావు ఢిల్లీకి హరీష్ రావు ఎందుకు వెళ్ళలేదో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తన స్థానమేంటో ప్రజలకు వివరించాలన్నారు.

దుబ్బాక, హుజురాబాద్ లో వెట్టి చాకిరీ చేయించుకోవడానికి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావును వాడుకుంటుందన్నారు. కేసీఆర్ ఆంధ్ర నేతల మోచేతి నీళ్ళు తాగుతున్నప్పుడే బీజేపీ చిన్న రాష్ట్రల ఏర్పాటును సమర్ధించిందన్నారు. గోదావరి జలాల కోసం విద్యాసాగరరావు పాదయాత్ర చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని గుర్తుచేశారు. తెలంగాణకు హక్కు దారులు తామే అన్నట్లు టీఆర్ఎస్ నేతలు వ్యవహరించటం సరైనది కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి జలదృశ్యం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే పరామర్శించని చరిత్ర కేసీఆర్ దని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed