నకిరేకల్ పుర చైర్మన్‌గా రాచకొండ.. వైస్‌చైర్మన్‌గా ఉమారాణి

by  |
నకిరేకల్ పుర చైర్మన్‌గా రాచకొండ.. వైస్‌చైర్మన్‌గా ఉమారాణి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తొలిసారిగా నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుదీరింది. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్‌గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా మురారి శెట్టి ఉమారాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నకిరేకల్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం జరిగింది. మొదటగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి 11 మంది టీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు, స్వతంత్ర కౌన్సిల్ సభ్యుడు కందాల భిక్షంరెడ్డితో కలిపి 12 మంది కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార హాల్‌లోకి వెళ్లారు. అనంతరం ఆరుగురు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు వేరువేరుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి మధ్యాహ్నాం 3 గంటలకు 20 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నాం 3.30 గంటలకు చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, నకిరేకల్ మునిసిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఓట్లు జిహెచ్ఎంసిలో ఉన్నట్టు కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జీహెచ్ఎంసీలో ఓట్లు ఉన్నందున ఎక్స్ అఫీషియో సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఓటు చెల్లవని చెప్పడంతో వారు వెనుదిరిగారు. మరో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక కార్యక్రమంలో
పాల్గొన్నారు.

చైర్మన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం

సుమారు 3.45 గంటలకు చైర్మన్ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. మొదటగా టీఆర్ఎస్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ పేరును రెండో వార్డు కౌన్సిలర్ సభ్యులు రాచకొండ సునీల్ కుమార్ ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిల్ సభ్యుడు పల్లె విజయ్ బలపరిచారు. ఇతర పార్టీ నుంచి చైర్మన్ పదవి కోసం ఎటువంటి నామినేషన్ రాకపోవడంతో రాచకొండ శ్రీనివాస్ నియామకం ఏకగ్రీవంగా జరిగినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ 11వ వార్డు కౌన్సిలర్ మురారి శెట్టి ఉమారాణి పేరును వైస్ చైర్మన్‌గా 10వ వార్డు కౌన్సిలర్ చౌగొని అఖిల ప్రతిపాదించగా, 14వ వార్డు కౌన్సిలర్ గడ్డం లక్ష్మీనరసింహస్వామి బలపరిచారు. వైస్ చైర్మన్ పదవికి కూడా ఎటువంటి నామినేషన్లు రాకపోవడంతో ఆమె ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి నూతన చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి కి నియామక పత్రాలు అందజేసి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ వాకాటి కరుణ, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీ, తహసీల్దార్ పి.శ్రీనివాస్, ఎంపీడీఓ జె.వెంకటేశ్వరరావు, వార్డు కౌన్సిలర్లు పొడుగు స్వాతి, గాజుల సుకన్య, సోమలక్ష్మి మంటిపల్లి కవిత, కొండ శ్రీను, పన్నాల పావని, సీహెచ్ రజిత, భానోతు వెంకన్న, పోతుల సునీత, యా సారపు లక్ష్మి, గర్షకోటి సైదులు, దైద స్వప్న, చౌగొని రాములమ్మ పాల్గొన్నారు.

కొత్త కౌన్సిలర్లను అభినందించిన మంత్రి

నకిరేకల్ మున్సిపాలిటీకి సంబంధించి కొత్తగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లను మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అభినందించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పనిచేస్తూ వారి సంక్షేమానికి పాటుపడాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. అలాంటప్పుడే ప్రజల్లో చిరస్థాయిగా నిలవచ్చని తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed