‘మేరా భారత్ మహాన్’ పూరీ క్లాస్

by  |
‘మేరా భారత్ మహాన్’ పూరీ క్లాస్
X

డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన సినిమాల ద్వారా మంచి మెసేజ్‌లు ఇస్తుంటాడు. చెప్పే విధానం కొంచెం కఠినంగా ఉన్నా..దాని గురించి ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంటుంది. నిజాన్ని నిర్భయంగా, ఎదుటివాడి చెంప చెళ్లుమనిపించేలా విషయాన్ని విడమరిచి చెప్పడం పూరికే చెల్లుతుంది. ఇప్పటి వరకు సమాజం పట్ల తనకున్న అభిప్రాయాన్ని హీరోల ద్వారా తెరపై చూపించిన పూరీ..ఇప్పుడు పాడ్ కాస్ట్ ద్వారా తానే చెప్తున్నాడు. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సైతం తన మాటలకు ఫిదా అయిపోగా..స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయుడిగా ఎలాంటి తప్పులు చేస్తున్నారో చెప్పారు. ప్రపంచం మొత్తం భారతీయుడిని గౌరవంగా చూస్తుంటే, పుణ్యభూమిలో పుట్టిన నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించు అంటూ ‘మేరా భారత్ మహాన్’ పేరుతో ఓ మెసేజ్ ఇచ్చాడు పూరీ. కాసేపు మన గురించి, మన దేశం గురించి నిజాలు మాట్లాడుకుందామని మొదలు పెట్టిన పూరీ..దేశంలో జరుగుతున్న ప్రతి తప్పునూ ఎత్తి చూపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అయినా నువ్వు చేసిన తప్పు మళ్లీ చేయకూడదనే ప్రమాణం చేసి దేశభక్తి చాటుకొమ్మని సూచించారు. కామన్ సెన్స్ లేని దేశ పౌరుల్లారా ఇప్పుడైనా మారాలని హెచ్చరించారు.

‘‘భారత దేశం కర్మ భూమి.. కానీ మనకు కామన్ సెన్స్ ఉండదు
మనది వేద భూమి.. ఆ వేదాలు ఎక్కడున్నాయో తెలియదు
ఇది పుణ్య భూమి.. మనం చేయని పాపం లేదు.
మనతల్లి భారతమాత .. కానీ, గంటకో రేపు చేస్తుంటాం
సువిశాల భారత ఖండం.. పాపులేషన్‌తో కిటకిటలాడి చస్తుంటాం
గంగా, యమున, గోదావరి.. ఆ నీళ్ల కోసమే కొట్టుకు చస్తుంటాం
ఎన్నో పుణ్యక్షేత్రాలు.. ఆ గుళ్ల బయటే చెప్పులు దొంగిలిస్తుంటాం
మహాకవులు పుట్టిన దేశం మనది.. 65% నిరక్షరాస్యత
మనది ఆర్య సంస్కృతి .. అందుకే పెట్రోల్‌లో కిరోసిన్ కలిపేస్తుంటాం.. పాలల్లో నీళ్లు కలిపేస్తాం.. రేషన్ బయట అమ్మేస్తాం.. ఓట్లు అమ్ముకుంటాం..దొంగ బిల్స్ పెడతాం.. బిల్ ఎగ్గొడతాం.. దొంగ సర్టిఫికెట్లు పెడతాం.. దొంగ నోట్లు గుద్దేస్తాం.. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుతాం.. ఆఖరికి డ్రైనేజ్ మూతలు కూడా అమ్మేస్తాం.. ’’ఇవి కాకుండా ..
ఫ్రీడం వల్ల మూడు చక్కటి విషయాలు నేర్చుకున్నాము
1. పెంట తీసి నెత్తిన రాసుకోవడం
2. కోడి గుడ్డు మీద వెంట్రుకలు పెరగడం
3 . పుల్ల పెట్టి పక్కన వాడిని గెలకడం

పైన చెప్పిన ఐటమ్స్ లో చాలా వరకు మనందరం చేసే ఉంటాం. అందుకే పేపర్ తీసి రాసుకుందాం. నేను చేసిన వెధవ పనులు అని రాసుకుందాం. ఎవరికి చూపించొద్దు. మనకోసమే అలా రాసుకుని ఫ్యూచర్‌లో చేయకుండా జాగ్రత్త పడదాం.

200 ఏళ్లు యుద్ధం చేసి ఫ్రీడం తెచ్చుకున్నాం ప్రయోజనం ఏంటి? మనం మారకపోతే ఏ నాయకుడు మనల్ని మార్చలేడు.

‘‘మొన్ననే గాల్వన్ వ్యాలీలో గొడవైంది.. ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. అక్సాచిన్‌లో చైనీస్‌తో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్. రాళ్లతో కొట్టుకున్నారు. ప్రాణం పోయేంత వరకు కొట్లాడారు. ఎందుకు? మనకోసం.. మన దేశం కోసం. చనిపోయిన సోల్జర్స్ వాళ్ల తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు.. కట్టుకున్న భార్యను మరిచిపోయారు. కన్న పిల్లలను మరిచిపోయారు. ప్రాణాల గురించి అసలు పట్టించుకోలేదు. కొన ఊపిరి వరకు వారికి ఒకటే గుర్తుంది.దేశం.. దేశం.. దేశం..నీ అమ్మ గర్వంతో చచ్చిపోయారు మన సోల్జర్స్..మేరా భారత్ మహాన్.. వారి కోసమైనా మనం ఈ చీప్ పనులు మానుకుందాం..వాళ్లలాగా దేశం కోసం చావనక్కర్లేదు..కనీసం ఆ గోడ మీద మూత్రం చేయకపోతే చాలు ..అది కూడా దేశ భక్తే.. జనగణమన.. ’’ అంటూ ముగించారు పూరీ.


Next Story

Most Viewed