నగరంలో శృతి మించిన పబ్ సంస్కృతి.. పట్టించుకోని అధికారులు..

by  |
నగరంలో శృతి మించిన పబ్ సంస్కృతి.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ లో పబ్ కల్చర్ యువతకు ఫ్యాషన్ గా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, కొలీగ్స్ తో కలిసి పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య పబ్ కల్చర్ మరీ ఎక్కువయ్యింది. పబ్బుల మాటున గబ్బు దందాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు మద్యం, ధూమపానానికి మాత్రమే పరిమితం అయిన ఈ పబ్ లు ఇప్పుడు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. ఈ విష సంస్కృతి లో చిక్కి యువత తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు అలసత్వం గా వ్యవహరించడం నిర్వాహకులకు వరంగా మారింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే కానీ అధికారులు మేల్కొనక పోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం.

హైకోర్టు ఆదేశాలతో నోటీసులు

జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పబ్ లు ఇళ్ల మధ్యలో వెలుస్తున్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 10 పబ్ లు జూబ్లీహిల్స్ లో జనావాసాల మధ్యనే ఉన్నాయని తాజాగా జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేశారు. అలాగే బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, బేగంపేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో చాలా పబ్ లు ఇళ్ల మధ్యలో ఉన్నాయని, వాటి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న మంటున్నారు స్థానికులు. అయినా సంబంధిత అధికారులకు మాత్రం ఇన్నాళ్లు అవేమీ పట్టలేదు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో కదిలి గురువారం 10 పబ్ లకు నోటీసులు జారీ చేశారు. వీటిపై ఈనెల 29 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది న్యాయస్థానం.

నిబంధనలకు నీళ్లు..

చెవులు చిల్లులు పడే మ్యూజిక్, ఏరులై పారే మద్యం, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే యూత్, కని కనిపించని లైటింగ్ ఇంకేముంది యువత ఉత్సాహానికి అడ్డే ముంటుంది. నచ్చినట్టు ఆడిపాడుతూ.. ఫుల్ గా మద్యం సేవించి చిందులు వేయడం యువతకు పరిపాటిగా మారింది. ఈ పబ్ ల ఏర్పాటులో చాలామంది నిర్వాహకులు కనీస నిబంధనలు కూడా పాటించడం లేదనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఇళ్ల మధ్య ఉండకూడదనేది ప్రాథమిక నిబంధన ఉంది. కానీ ఒక్క జూబ్లీహిల్స్ లోనే 11 పబ్ లు ఇళ్ల మధ్య ఉన్నాయంటే అధికారుల వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రణగొన ధ్వనులు షరా మామూలే.

ఈ పబ్ లు ఉన్న ప్రతీ చోట విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. వారికి అగ్నిమాపక నిబంధనలు కూడా పట్టడం లేదు. చాలా పబ్ లకు కనీసం పార్కింగ్ సౌకర్యం లేదు. పబ్ కు వచ్చిన వారు పక్కనే ఉన్న కాలనీల్లో వాహనాలను పార్క్ చేసి వెళ్తున్నారు. అదీగాక అర్ధరాత్రి తిరిగి వెళ్లే సమయంలోనూ తాగి నానాయాగీ చేస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పబ్ లో 21 సంవత్సరాల లోపు వారికి అనుమతి లేకున్నా ఇటీవల గచ్చిబౌలిలో ఓ పబ్ లోకి మైనర్ బాలికను అనుమతించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఇలా అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించడం పరిపాటిగా మారింది.

యువతే వారి టార్గెట్..

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్ లతో యువత తప్పుదారి పడుతుండగా తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ఈ పబ్ కల్చర్ యూత్ ను మద్యానికి, డ్రగ్స్ కు బానిసలను చేస్తుంది. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసానికి, పబ్బులకు వెళ్తున్నామని చెప్తున్నా యువతను తమ ఆఫర్లతో ఆకట్టుకుని అగాధంలోకి నెడుతున్నాయి. ఇప్పటికే సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ లు యూత్ వీకినెస్ ను ఆసరాగా చేసుకుని కాసుల వేట కొనసాగిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు ఆఫర్లు ప్రకటిస్తూ మద్యం మత్తులో జోగేలా చేస్తున్నాయి. అదే మత్తు తలకెక్కి ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో.

షరా మామూలే..

పబ్ లపై దాడులు చేయడం, అవి తిరిగి వారం రోజుల్లో తేర్చుకోవడం షరా మామూలు విషయమే. వీటి వెనుక ఎవరున్నారు, ఏ స్థాయి మేనేజ్ మెంట్ ఉంటుంది అన్నది తెలిసిన విషయమే. ఇటీవల పంజాగుట్టలోని ఓ పబ్‌ పై వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయినా వారు మారలేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొత్తం 48 పబ్‌ లు ఉండగా, అందులో కేవలం 12 పబ్ లకు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయని, మిగతా పబ్బులు నిబంధనలు పాటించడం లేదని సమాచారం. గతంలో అధికారులు సీజ్ చేసిన 15 పబ్ లు కూడా కొందరి ఒత్తిడితో గంటల వ్యవధిలోనే తెరుచుకున్నాయి. మరి తాజాగా హైకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. పబ్ ల గబ్బు కల్చర్ కు కళ్లెం వేస్తారా లేదా ఎప్పటిలాగానే మమ అనిపిస్తారా చూడాలి.

Next Story

Most Viewed