టీటీడీలో నిరసన సెగలు 

by  |
టీటీడీలో నిరసన సెగలు 
X

దిశ, వెబ్ డెస్క్: ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌ (APCOS) లో విలీనం చేయ‌రాద‌ని కోరుతూ రెండో రోజు మంగళవారం కూడా నిరసనలు కొనసాగాయి. టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో ఔట్‌సోర్సింగ్ కార్మిక సిబ్బంది మోకాళ్ల‌పై నిల‌బ‌డి నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జ‌రిగింది.

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌర‌వాధ్య‌క్షులు ఎం.నాగార్జున మాట్లాడుతూ.. APCOSలో విలీన నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని యాజ‌మాన్యానికి ప‌లుసార్లు విజ్ఞ‌ప్తి చేసినా స్పందించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌‌మ‌న్నారు. ఈ విష‌యం రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి చేరే వ‌ర‌కు దీక్ష‌ల‌ను కొన‌సాగిస్తామ‌న్నారు. టిటిడిలో నిధుల కొర‌త లేద‌ని, APCOSలో విలీనం చేయ‌కుండా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు టైంస్కేల్ వ‌ర్తింప‌చేయాల‌ని డిమాండ్ చేశారు.

టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ… 10 నుండి 15 ఏళ్ల పాటు విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బందికి ఎలాంటి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌కుండా.. APCOS లో క‌ల‌ప‌డం వ‌ల్ల అంద‌రిలో అయోమ‌యం నెల‌కొంద‌న్నారు. టిటిడి యాజ‌మాన్యం స్పందించి త‌మ‌కు త‌గిన న్యాయం చేయాల‌ని కోరారు. టిటిడిలో 14 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు చాలీచాల‌ని జీతాల‌తో కుటుంబ పోష‌ణ‌కు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన హామీని నెర‌వేర్చేలా టిటిడి యాజ‌మాన్యం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు.

టిటిడి స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల ఒక ట్ర‌స్టు అని, ఇక్క‌డ ప‌నిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేష‌న్‌లో విలీనం చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టిటిడి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌రికృష్ణ‌, కోశాధికారి నవీన్ కుమార్‌, టిటిడిలోని ప్రెస్‌, అన్న‌దానం, ఉద్యాన‌వ‌న‌, హాస్ట‌ళ్లు, మ్యూజియం, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల సొసైటీల‌కు చెందిన వి.సుబ్ర‌మ‌ణ్యం, టి.సులోచ‌న‌, ఎస్‌.దేశ‌మ్మ‌, కె.స‌త్య సామ్రాట్‌, సి.గోవింద‌స్వామి, ప్ర‌భు ప్ర‌కాష్‌, పి.హ‌రిప్ర‌సాద్‌, కె.చంద్ర‌శేఖ‌ర్‌, సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story