సీఎంకు ఫ్రొఫెసర్ హరగోపాల్ లేఖ

by  |
సీఎంకు ఫ్రొఫెసర్ హరగోపాల్ లేఖ
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ విడుదలకు చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ విజ్ఞప్తి చేశారు. ‘ఉపా’ చట్టం క్రింద అరెస్టయ్యి ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నారని, ఈ నెల 6న బెయిల్‌పై విడుదలైన తర్వాత ఎన్ఐఏ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారని పేర్కొన్నారు. జైల్లో ఉన్నప్పుడే అనారోగ్యానికి గురైన కృష్ణను వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ గాంధీ ఆసుపత్రుల్లో చేర్పించారని, శ్వాసకోస సంబంధమైన ఆస్తమా, తీవ్రమైన నడుము నొప్పితో బాధపడే డిస్క్ సమస్య కారణంగా కనీసం నడవలేని స్థితికి చేరుకున్నారని లేఖలో గుర్తుచేశారు.

ఈ నెల 13న ఖమ్మంలోని కిమ్స్ హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటుండగా 14న ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకునేలా మెజిస్ట్రేట్ వెసులుబాటు ఇచ్చినందున ఎన్ఐఏ పోలీసులు ఆ గడువు తర్వాత అదుపులోకి తీసుకొని మళ్లీ జైలుకు తరలించే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారి కరోనా సోకే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు.

రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలిగేలా శాంతి భద్రతల అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ ద్వారా రాష్ట్రంలో జోక్యం చేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. టీపీఎఫ్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధానికి గురిచేయడం అప్రజాస్వామిక చర్య అని, కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఖండించి ఎన్ఐఏ కస్టడీ నుంచి నలమాస కృష్ణను విడిపించడానికి చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.



Next Story

Most Viewed