వారి నిర్లక్ష్యం.. నర్సింగ్ విద్యార్థులకు శాపం?

by  |
nursing-students
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యాధికారుల నిర్లక్ష్యం స్కూల్ ఆఫ్ నర్సింగ్​ విద్యార్ధులకు శాపంగా మారింది. ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్యలను పట్టించుకునే వారు లేరని టీచర్లతో పాటు విద్యార్ధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంఈ రమేష్​రెడ్డికి నర్సుల సమస్యలు అంటేనే పట్టింపు లేదని మండిపడుతున్నారు. తమ ప్రాబ్లమ్స్​ ను పరిష్కరించేందుకు ఆయన ఆసక్తి చూపరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జీఎన్​ఎం కోర్సు కు ప్రత్యేక బిల్డింగ్​లు లేనందున ఫ్యాకల్టీతో పాటు విద్యార్ధులూ నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉస్మానియా బిల్డింగ్​ ను స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా గాంధీ నర్సింగ్​ కాలేజీని కూడా ఖాళీ చేయించారు. తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్ధులు, ఫ్యాకల్టీ మొరపెట్టుకున్నా, డీఎంఈ కనీస బాధ్యతతో వ్యవహరించడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్ని లేఖలు రాసినా రిప్లే ఇవ్వడం లేదని నర్సింగ్​ అధికారులు చెబుతున్నారు.

ఇరుకు గదులతో ఇబ్బందులు..
జీఎన్ఎం నర్సింగ్​3 సంవత్సరాల కోర్సులో సుమారు 180 మంది విద్యార్ధులుంటారు. ప్రత్యక్ష తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని ఇటీవల డీఎంఈ సూచన మేరకు వారంతా ప్రస్తుతం ఆయా కాలేజీలకు చేరుకున్నారు. కానీ ఉండేందుకు హాస్టళ్లు, తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉస్మానియాలో బిల్డింగ్​కేటాయించాలని డీఎంఈ అక్కడి అధికారులకు సూచించినా ఇప్పటి వరకు కేటాయించలేదు. అంతేగాక గాంధీ ఆసుపత్రిలోని 8వ ఫ్లోర్​లోని విభాగాన్ని స్కూల్​ ఆఫ్​ నర్సింగ్​ కి తిరిగి ఇవ్వలేదు. కరోనా కేసులు విపరీతంగా ఉన్న రోజుల్లో తీసుకున్న ఫ్లోర్​ను ఇప్పటి వరకు అందివ్వకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఫ్లోర్​ను చికిత్స నిమిత్తం వినియోగించకున్నా, ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావట్లేదని నర్సింగ్​ అధికారులు వాపోతున్నారు.

తమకు బోయిగూడలోని కాలేజీ ఆఫ్​ నర్సింగ్​లో తాత్కాలికంగా క్లాస్​లు నిర్వహించాలని అనుమతులు ఇచ్చినప్పటికీ, స్కూల్​ ఆఫ్​ నర్సింగ్, కాలేజీ ఆఫ్​ నర్సింగ్​ రెండు విభాగాల విద్యార్ధులు ఒకే దగ్గర ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరుకైన గదులు, ల్యాబ్​, లైబ్రరీలు లేక విద్యార్ధులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేగాక హస్టళ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉన్నది. స్టాఫ్​ తక్కువగా ఉండటం వలన విద్యార్ధినులకు రక్షణ కరువైందని నర్సింగ్​ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల గాంధీ నర్సింగ్​ కాలేజీలో దొంగలు కూడా పడ్డారు. అర్ధరాత్రి ఓ వ్యక్తి హాస్టళ్లోకి చొరబడి విద్యార్ధులను భయాందోళనకు గురిచేసినట్టు సమాచారం. అంతేగాక ప్రతీ రోజు పాముల బెడదతో పరేషాన్​ అవుతున్నట్టు తెలిపారు. సరైన సెక్యూరిటీ లేని కారణాన నర్సింగ్ విద్యార్ధులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని ఓ అధికారి దిశకు తెలిపారు.

హాస్టళ్లన్నీ అపరిశుభ్రం..

ఇన్నాళ్లు విద్యార్ధులెవ్వరూ క్లాస్​లు, హాస్టళ్లలో లేనందున వరంగల్​ ఎంజీఎం, గాంధీ, ఉస్మానియా స్కూల్స్​లో గదులన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. శానిటేషన్​, విద్యుత్, వాటర్​వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. నల్లాలు లీకేజ్​, శుభ్రత లేని బాత్​ రూంలు, తరగతి గదుల్లో చెత్తా చెదారంతో నిండిపోయాయి. అంతేగాక కొన్ని చోట్ల డోర్లు, కిటికీలు కూడా పాడైపోయాయి. రిపేర్లు చేయించాలని ఉన్నతాధికారులను కోరుతున్నా, స్పందించడం లేదని నర్సింగ్​ అధికారులు పేర్కొంటున్నారు. పేద పిల్లలు చదువుకునే ఇలాంటి హాస్టళ్ల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed