అడ్మిట్ అయితే కండీషన్స్ అప్లై.. ప్రైవేటు ఆసుపత్రుల దందా

by  |
అడ్మిట్ అయితే కండీషన్స్ అప్లై.. ప్రైవేటు ఆసుపత్రుల దందా
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా తయారైంది కరీంనగర్‌లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరు. కరోనా మహమ్మారి చంపుతుందన్న భయం పేషెంట్లను వెంటాడుతుంటే.. అడ్డగోలుగా ధరలు పెంచి దందా చేస్తూ.. ప్రైవేటు ఆసుపత్రులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇన్సూరెన్స్, రియంబర్స్‌మెంట్ క్లైయిమ్ చేసుకునే వారికి తప్ప సాధారణ పేషెంట్లకు బిల్లులు ఇచ్చే ప్రసక్తే లేదని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు తేల్చిచెప్తున్నాయి.

కండీషన్స్ ఒప్పుకుంటేనే జాయిన్ చేసుకుంటాం లేకుంటే లేదు అంటూ హుకుం జారీ చేస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు. ఆసుపత్రిలో అందించే చికిత్స అయినా, మెడికల్ స్టోర్‌లో కొన్న మందుల బిల్లు అయినా సరే.. తాము మాత్రం ఇచ్చేది లేదని పేషెంట్లతో స్పష్టంగా చెబుతున్నాయి. చికిత్స అందకపోతే తమ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమోనన్న ఆందోళనతో బాధితులు ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు. ఇదే అదనుగా భావించిన ఆసుపత్రుల యాజమాన్యాలు వారిని నిలువుదోపిడీకి గురి చేస్తున్నాయి.

ఫుడ్‌కు వెయ్యి..

ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న నిలువుదోపిడీ తతంగానికి ఈ ఒక్క ఉదాహారణ చాలేమో. కొవిడ్ బాధితులకు మూడు పూటలా అందించే భోజనం ఖర్చు ఎంతో తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒక్కో పేషెంట్ వద్ద రోజుకు రూ. వెయ్యి వసూలు చేస్తున్నారు. స్టార్ హోటల్ ఫుడ్ రేట్లను వేస్తూ.. చివరకు మామూలు హోటళ్ల నుంచి తెచ్చిన ఫుడ్ ఇస్తుండటం గమనార్హం. కరోనా పేషెంట్లు అయినందున వారికి ప్రత్యేకంగా పౌష్టికాహారం తయారు చేసి ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ హోటల్స్ యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుని ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. హోటళ్లలో పార్శిల్ ద్వారా ఫుల్ భోజనం అయితే రూ. 100, నాన్ వెజ్‌తో అయితే రూ. 150 వరకు ధర ఉంటుంది. కానీ పేషెంట్ల వద్ద మాత్రం కొన్ని ఆసుపత్రులు వసూలు చేస్తున్న తీరు విస్మయపరుస్తోంది.

ధరలపై కఠినమా..?

ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న నిలువు దోపిడీపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలిచ్చారు. ఇటీవల జరిగిన రివ్యూ సమావేశంలో ఆయన ఆసుపత్రుల్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధరలు వసూలు చేయాలి తప్ప.. అదనంగా తీసుకుంటే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మాత్రం తమ దొపిడీని వీడటం లేదు.

ట్యాక్స్ ఎగవేతకేనా.?

అయితే కరోనా మహమ్మారి వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రూ. కోట్లలో దందా సాగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు రూ. 5 నుంచి 6 కోట్ల వరకూ ఆసుపత్రులు, మందుల కోసమే పేషెంట్లు డబ్బులు వెచ్చిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పేషెంట్లను పట్టి పీడిస్తున్న కొంతమంది ప్రైవేటు వైద్యులు బిల్లులు ఇవ్వకుండా తక్కువ ఆదాయం చూపించి డబ్బును నల్ల ధనంగా మార్చే కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేషెంట్లకు బిల్లులు ఇస్తే ట్యాక్స్‌లు చెల్లించాల్సి వస్తోందన్న ఆలోచనతోనే ఈ కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కవ ధరలు వసూలు చేస్తున్న విషయం రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోతామని భావించే.. బిల్లులు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని ఆసుపత్రుల్లో రూ. లక్షల బిల్లు చెల్లిస్తే వేలల్లో మాత్రమే బిల్లులు ఇస్తున్నారని సమాచారం.

దాడి చేసే దమ్ముందా..?

ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ఈ అక్రమాల దందాపై ఐటీ అధికారులు, విజిలెన్స్ వింగ్, వైద్య ఆరోగ్య శాఖ కానీ వారిపై దాడి చేసే దమ్ము ఎవరికీ లేదన్న ధైర్యమే వారిని ముందుకు నడిపిస్తోంది. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లోకి వెళ్లేందుకు చాలా మంది జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు కొవిడ్‌కు భయపడి ఆసుపత్రులవైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ ధీమాతోనే అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కఠినంగా వ్యవహరించాలి..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా పేషెంట్ల విషయంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరుపై కఠినంగా వ్యవహరించాలి. పేషెంట్ల ముక్కుపిండి అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తూ.. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు బిల్లులు కూడా ఇవ్వడం లేదు. మెడికల్ షాపుల్లో మందుల ధరలు కూడా పెంచి పేషెంట్లను పట్టి పీడిస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝులిపించాలి. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అయినా ఆసుపత్రుల్లో జరిగిన అక్రమ వసూళ్లపై అన్ని కోణాల్లో విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
-పైడిపల్లి రాజు, సీపీఐ జిల్లా నాయకులు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి..

ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేషెంట్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండి. పేషెంట్లు ఎంత బిల్లు చెల్లించారు.. ఎప్పుడు జాయిన్ అయ్యారు, డిశ్చార్జి ఎప్పుడయ్యారు. వారు చెల్లించిన బిల్లు ఎంత తదితర వివరాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదు.
– జువేరియా, డిహెంచ్ఓ కరీంనగర్.


Next Story