సక్సెస్‌ క్రియేట్ చేయాలి.. ధరణిపై నో ఆర్గ్యుమెంట్స్..!

by  |
సక్సెస్‌ క్రియేట్ చేయాలి.. ధరణిపై నో ఆర్గ్యుమెంట్స్..!
X

అక్కడ వాద, ప్రతివాదనలకు తావులేదు.. న్యాయవాదులకు ప్రవేశమే లేదు. లిఖిత పూర్వక వాదనకు నోచాన్స్ అంటున్నారు రెవెన్యూ ట్రిబ్యునల్ అధికారులు. ధరణి పోర్టల్ ను విజయవంతం చేసేందుకు అపసోపాలు పడుతున్న ప్రభుత్వం.. పెండింగ్ లో ఉన్న 16 వేల కేసుల పరిష్కారాన్ని ఈ నెల 10వ తేదీ లోపు ప్రత్యేక ట్రిబ్యునళ్లలో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించింది. వాదనలు వినకుండా ఇచ్చే తీర్పు చెల్లదని కలెక్టర్లకు తెలిసినా.. ఆవేవీ పట్టించుకోవడం లేదు. ఈ కేసులన్నీ సివిల్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి పోర్టల్ విజయవంతమైందని రుజువు చేయడానికి, దాన్ని మించిన మరో విధానమే లేదని వాదించడానికి ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. భూ సంబంధ కేసుల సంఖ్య జీరో అని చెప్పేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ, కేసులు పెండింగులో లేకుండా చూడాలన్న కాంక్షను అధికారులపై బలవంతంగా రుద్దుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల కన్నా మనమే బెటర్​గా ఉన్నామనే భావన క్రియేట్​ చేయడానికే పడరాని పాట్లు పడుతున్నదని రెవెన్యూ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అందుకే సమస్యల పరిష్కారానికి కాలపరిమితిని విధించి చేతులు దులుపుకుంటున్నదని న్యాయవాదులు పేర్కొంటున్నారు.

ఏ కేసులోనైనా నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండా ఇచ్చే తీర్పు చెల్లదని కలెక్టర్లకూ తెలిసినా, అవేవీ అవసరం లేకుండా స్పెషల్​ ట్రిబ్యునళ్లు రెవెన్యూ రికార్డుల ప్రకారమే పని చేస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలా లెక్క తేల్చిన కేసుల్లో చాలా మళ్లీ సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు మళ్లీ తీర్పులు వెలువరించిన అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే అవకాశాలు అనివార్యమవుతాయని రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేసులకు సంబంధించిన సిఫారసుల కోసం అధికారులపై ఒత్తిడిని పెంచుతున్నారని, దాంతో రిటైర్డ్ తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లకు ఉపాధి లభించిందని, మండల స్థాయిలో సిఫారసుల ఆధారంగానే వెలువడే తీర్పుల ఫలితాలు ఎలా ఉంటాయో భవిష్యత్తు నిర్దేశిస్తుందని భూ చట్టాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగులోని 16 వేల కేసుల్లో సగానికి పైగా తిరిగి సివిల్ కోర్టుకే వెళ్తాయని, ప్రాథమిక న్యాయ సూత్రాలు పాటించకుండా అమలు చేయడం ద్వారా ఫలితాలు వ్యతిరేకంగానే ఉంటాయంటున్నారు.

వాదనల తిరస్కరణ..

ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఆవిర్భావం, మార్గదర్శకాలు జారీ కాగానే పెండింగ్ కేసుల బాధితులు అప్రమత్తమయ్యారు. నోటీసులు జారీ చేస్తారో, లేదోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వారి కేసులకు సంబంధించిన వాదనల గురించి ముందే కలెక్టర్లకు అర్జీలు పెట్టుకున్నారు. ఇంకొందరు కేసులకు సంబంధించిన వాదనలను లిఖితపూర్వకంగా ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో న్యాయవాదులే ఫలానా కేసులకు చెందిన లిఖితపూర్వక వాదనలు అంటూ డాక్యుమెంట్లు సమర్పించారు. చాలా జిల్లాల్లో న్యాయవాదులిచ్చే డాక్యుమెంట్లు, రిటర్న్ డాక్యుమెంట్లు తీసుకోవాలని తమకు ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదని తిరస్కరించిన ఉదంతాలు ఉన్నాయి. కేసుల వాదనల తేదీలు, సమాచారం ఇవ్వకపోయినా క్లయింట్ల తరఫున కొందరు న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు రాసిచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే తీర్పును వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయని కొందరు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు, తమ క్లయింట్లకు ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదంటున్నారు. కోర్టులకు వెళ్లి తమ వాదనలు వినలేదని, అవకాశం కల్పించలేదని రుజువు చేసుకుంటే ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పులను కొట్టేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.

ఎదురుచూపులే..

భూ సంబంధ కేసుల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థే బాగుండేది. ఏదైనా అన్యాయం జరిగిందనిపిస్తే తహసీల్దార్లకు, లేదంటే ఆర్డీఓకు అప్పీలు చేసుకునే అవకాశం ఉండేది. అక్కడా న్యాయం జరగలేదనిపిస్తే జేసీ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకునే వారు. ఏ ఖర్చు లేకుండా బాధితుడే కార్యాలయానికి వెళ్లి న్యాయం పొందే వెసలుబాటు ఉండేది. కొత్త ఆర్వోఆర్ చట్టం అమలు తర్వాత ఈ వ్యవస్థ రద్దయ్యింది. కేవలం తాత్కాలిక ట్రిబ్యునల్ ద్వారా పెండింగు కేసుల లెక్క మాత్రమే తేలుస్తున్నారు. అందులోనూ అస్పష్టమైన విధానాన్ని అనుసరిస్తుండడంతో సివిల్ కోర్టులను ఆశ్రయించడం అనివార్యంగా మారే అవకాశాలున్నాయని ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను అమలు చేస్తోందని మరో న్యాయవాది వివరించారు. 16 వేల కేసుల్లోనూ చాలా వాటికి న్యాయవాదులు లేరు. ఫిర్యాదుదారులే వారి వాదనలను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ అవకాశం కూడా లభించకపోతే వాస్తవాలు ట్రిబ్యునల్ కు తెలిసే అవకాశాలు తక్కువని రెవెన్యూ చట్టాల నిపుణులు అంటున్నారు.

న్యాయవాదులను అనుమతించండి..

రెవెన్యూ ప్రత్యేక ట్రిబ్యునల్ కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు రాష్ట్ర బార్ కౌన్సిల్ లేఖ రాసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అప్పీళ్లపై విచారణ ముగిస్తున్నారని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ కు కూడా కౌన్సిల్ ప్రతినిధులు లేఖ సమర్పించారు. న్యాయవాదుల హాజరును ట్రిబ్యునల్ అధికారులు తిరస్కరిస్తున్నదని, పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం న్యాయవాదుల పాత్ర ఉండేదని అంటున్నారు. ఇప్పుడేమో దరఖాస్తుదారుడి పక్షాన అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వడం లేదని, స్పెషల్ ట్రిబ్యునళ్ల ద్వారా తీర్పులు వెలువరించే ముందు వాదనలు వినడం ద్వారానే స్పష్టత లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.



Next Story

Most Viewed