ప్రజలకు సీఎం కేసీఆర్ 'కరెంట్' షాక్.. పెరగనున్న పవర్ బిల్

by  |
power companies
X

దిశ, తెలంగాణ బ్యూరో: సామాన్యులపై విద్యుత్ భారం పడనుంది. విద్యుత్​ సంస్థలను అప్పుల నుంచి గట్టెక్కించేందుకు టారిఫ్​ పెంచాలని తెలంగాణ సర్కార్ ​ఆలోచనలు చేస్తోంది. గతంలో కమర్షియల్​ చార్జీలు మాత్రమే పెంచిన ప్రభుత్వం ..తాజాగా గృహావసరాలకు వినియోగించే విద్యుత్​ చార్జీలు సైతం పెంచాలని చూస్తోంది. విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో ఉన్నాయని, గట్టెక్కాలంటే టారిఫ్​ పెంచక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. గతంలో ససేమిరా అన్నారు. కానీ తాజాగా విద్యుత్​ చార్జీలు పెంచడం తప్పదని నిర్ణయం తీసుకున్నారు. అయితే పెంచితే ఎంతమేర పెంచొచ్చనే అంశాలపై కసరత్తులు జరుగుతున్నాయి. ఎంతమేర చార్జీలు పెంచాలనే విషయమై విద్యుత్​ అధికారులు నోరు మెదపడం లేదు. టారిఫ్ పెంపుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్​నోటివెంట పెంపుదల మాట రావడంతో టారిఫ్ పెంచడం మాత్రం పక్కా అని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను సవరించలేదు. గతేడాది మార్చిలోనే టారిఫ్ పెంచుతామని డిస్కంలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా కొవిడ్ కారణంగా ఇది వాయిదా పడింది. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు గట్టెక్కాలంటే చార్జీలను పెంచాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. దీంతో పెంపు తప్పేలా లేదు. ఇప్పటికే కొవిడ్ తో సతమతమవుతున్న సామాన్యుడికి కరెంట్ ​షాక్​ తప్పేలా లేదు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ విద్యుత్​ సంస్థలు ఇప్పటికే రూ.46 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. రుణాలు తీసుకుని ఊబి నుంచి బయటపడాలని చూసినా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అప్పుల్లో ఉన్న సంస్థలకు రుణాలు ఇవ్వొద్దని విద్యుత్​ రెగ్యులేటరీ కమిషన్​కు ఆదేశాలిచ్చింది. దీంతో టారిఫ్ పెంపు తప్ప మరే అవకాశం విద్యుత్​ సంస్థలకు లేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ప్రతినెలా 250 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందజేస్తోంది. అలాగే వ్యవసాయానికి నిరంతరం కరెంట్ సరఫరా చేస్తోంది. పలు పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తోంది. వెరసి ఈ భారమంతా సామాన్యులపై పడుతోంది.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను కేటగిరీల వారీగా విభజించిన విషయం తెలిసిందే. అందులో డొమెస్టిక్, నాన్​ డొమెస్టిక్, ఇండస్ట్రీస్, కాటేజ్​ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, స్ట్రీట్​ లైటింగ్, పీడబ్ల్యూఎస్, జనరల్, టెంపరరీ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇప్పుడు చార్జీలు పెంచితే అన్ని కేటగిరీలకు పెంచుతారా? లేక గృహావసరాలకు సంబంధించిన టారిఫ్​ మాత్రమే పెంచుతారా అనేది తెలియాల్సి ఉంది. అగ్రికల్చర్​ కూడా పెంచితే రైతులపై సైతం భారం పడనుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకూ భారం తప్పేలా లేదు. 2018-19కి సంబంధించి డొమెస్టిక్​ కేటగిరీలో యూనిట్ల వారీగా రేట్లు ఫిక్స్​ చేశారు. నెలకు 0-50 యూనిట్లకు రూ.1.45 ఉంటే 51‌-100 యూనిట్లలోపు రూ.2.60గా ఉంది. 101-200 యూనిట్లకు రూ.4.30గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా 0-200 యూనిట్లకు రూ.5, 201-300కు రూ.7.20, 301-400కు రూ.8.50, 401-800 యూనిట్లకు రూ.9.00, 800 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తే రూ.9.50గా టారిఫ్​ఉంది. ఇప్పుడు సర్కార్​తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. నాన్​ డొమెస్టిక్​ పరిధిలో ఈ రేటు రూ.6 నుంచి మొదలై 500 యూనిట్లు దాటితే రూ.10 గా నిర్ణయించింది. అత్యధికంగా అడ్వర్టైజింగ్​హోర్డింగులకు యూనిట్​కు రూ.12 చొప్పున వసూలు చేస్తోంది.

డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని ధరలు పెంచాల్సి వస్తే గృహావసరాలపై పెంచుతారా లేక గతంలో మాదిరిగా కమర్షియల్​ టారిఫ్‌నే పెంచుతారా? అనే అనుమానం సామాన్యుల్లో రేకెత్తుతోంది. ఒక వేళ గృహావసరాలకు సంబంధించిన కరెంట్​ చార్జీలు పెంచితే భారం మోసేదెలా అనే భయాందోళనలో ప్రజలున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంపు ప్రభుత్వానికి సైతం మంచిది కాదని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. కొద్ది రోజుల్లో హుజురాబాద్​ ఎన్నికలు, ఈ ఎన్నికలు పూర్తికాగానే అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యుడిపై గుదిబండలా భారం మోపితే ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి సంస్థలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తుందా? లేక ఈ ఎన్నికల సమయంలో ధరలు పెంచి ప్రజల నుంచి వ్యతిరేకతను మూటకట్టుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed