పౌల్ట్రీ యజమానులకు బర్డ్ ఫ్లూ దెబ్బ

by  |
పౌల్ట్రీ యజమానులకు బర్డ్ ఫ్లూ దెబ్బ
X

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన పౌల్ట్రీ యజమానులకు బర్డ్ ఫ్లూ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పక్షులకు బర్డ్ ఫ్లూ వైరస్ మళ్లీ వస్తోంది.. ముఖ్యంగా కోళ్లకే అధికంగా బర్డ్ ఫ్లూ సోకుతోందనే సమాచారం వాట్సాప్‌లలో వైరల్ అవుతోంది. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా చాలా చికెన్ సెంటర్లు వినియోగదారులు లేక వెలవెల బోయాయి. లాక్‌డౌన్ కారణంగా అన్నీ బంద్ ఉండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కోళ్ల పరిశ్రమల రైతులు చాలా వరకు కోళ్లకు దాణా లేక కోళ్లని బతికుండగానే పూడ్చిపెట్టారు.

లాక్‌డౌన్ ముగిశాక నెమ్మదిగా షాపులు ప్రారంభం కావడం.. చికెన్ తినడం వల్ల కరోనా రాదని, కొవిడ్‌ నివారణకు చికెన్ తినాలని చెప్పడం‌తో ఇప్పుడిప్పుడే మాంసం ప్రియులు చికెన్ షాప్‌లకు వెళ్లడం ప్రారంభించారు. తాజాగా బర్డ్ ఫ్లూ కారణంగా మళ్లీ నష్టాల బాటలోకి నెట్టివేయబోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. బర్డ్ ఫ్లూ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సోకిందని తెలవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న షాప్‌ల్లో గిరాకీ తగ్గింది. ఒక్కసారిగా అమ్మకాలు పడిపోయాయి. దీనికి తోడు శుభ ముహూర్తాలు సైతం రేపటితో ముగియడంతో మరింత అమ్మకాలు తగ్గనున్నాయి. డిమాండ్ లేకపోవడంతో కోళ్లను రైతులు తెగనమ్ముకుంటున్నారు. పలుచోట్ల కోళ్లను ఉచితంగా ఇచ్చేస్తున్నారు. మొన్నటి వరకు కరోనా.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ‌తో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, తమని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed