YSR కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి అభిమాని: రామచంద్రా రావు

by Disha Web Desk 2 |
YSR కుటుంబానికి మాజీ ఎంపీ పొంగులేటి అభిమాని: రామచంద్రా రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను చూస్తే బీఆర్ఎస్‌ భయపడుతుందని, అందుకే తమ పార్టీ నేతలను చూస్తే సీఎం కేసీఆర్‌కు వణుకు పుడుతుందని వైఎస్ఆర్టీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ మెంబర్ గట్టు రామచంద్ర రావు అన్నారు. సోమవారం వైఎస్ఆర్టీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టు రామచంద్ర రావు మాట్లాడుతూ.. వైఎస్ఆర్టీపీ పై నిర్బంధం కొనసాగుతుందని, తమ పార్టీ నేతలను బయట అడుగు పెట్టనీయడం లేదని ధ్వజమెత్తారు. మా పార్టీ ఆఫీస్‌కి మేము రావడానికి కూడా అనుమతి అంటున్నారని మండిపడ్డారు. నేతల ఇండ్ల దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. టీ సేవ్ పేరుతో అన్ని వర్గాల వారిని కలుపుకొని నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నామని తెలిపారు.

లోటస్ పాండ్ వద్ద ఎందుకు పోలీస్ హడావిడి ఉందని, తమ పార్టీ వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ వద్ద దీక్షకు అనుమతి ఇవ్వలేదన్నారు. చివరి వరకు అనుమతి పెండింగ్‌లో పెట్టి అనుమతి లేదని చెప్పారని అన్నారు. ఇందిరా పార్క్ ఉన్నదే ధర్నాలు, దీక్షలు చేయడానికి అని, ఇందిరాపార్కు వద్ద ఆందోళనలు చేయక పోతే తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు. ఈ దీక్షకు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగుల పక్షాన దీక్షను ఆపేది లేదని, కోర్ట్ ద్వారా అనుమతి తెచ్చుకుంటామన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి కీలక వ్యక్తి అని అన్నారు. ఆయన ఏ పార్టీలో వెళ్తాడు అనేది ఆయన ఇష్టమన్నారు. తమ పార్టీలో చేరేందుకు ఎప్పుడు గేట్లు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. పొంగులేటి వైఎస్సార్ కుటుంబానికి అభిమాని అని అన్నారు. రాజకీయాల కోసం కాకున్నా ఎప్పుడు కలుస్తూనే ఉంటారని స్పష్టంచేశారు.



Next Story

Most Viewed