AP Politics: కొంపముంచుతున్న ఎంవీవీ పంపకాలు.. రాష్ట్రంలో గందరగోళం

by Disha Web Desk 3 |
AP Politics: కొంపముంచుతున్న ఎంవీవీ పంపకాలు.. రాష్ట్రంలో గందరగోళం
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: కేవలం నోట్ల కట్టలు విసిరి ఎన్నికల్లో గెలిచేద్దామనుకొన్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చివరకు ఆ డబ్బుతోనే కష్టాలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలతో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా సొంతపార్టీ నాయకుల సహాయ నిరాకరణతో విశాఖ పార్లమెంటు సభ్యుడు, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఎంపీ సీటును వదిలేసి విశాఖ తూర్పు నియోజకవర్గంపై కన్నేసిన ఎంవీవీ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో నియోజకవర్గంలోని వైసీపీ నేతలను, ఓటర్లను కొన్ని నెలల ముందునుంచే ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వార్డు స్థాయి నేతల నుంచి కార్పొరేటర్, ఆఖరికి ఎమ్మెల్యే టికెట్టుకు పోటీలో ఉన్న కొందరు నేతలను భారీ స్థాయి డబ్బు సంచులు పంచి లోబరుచుకున్నారన్న వార్తలు అప్పట్లోనే గుప్పుమన్నాయి.

తననుకాదన్న వారిని మరికొందరని పార్టీ పెద్దల ద్వారా నిరాదరణకు గురిచేసి బయటకు పంపించేశారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ అప్పట్లోనే తూర్పు నియోజక వర్గం పరిధిలోని కార్పొరేటర్ అందరికీ రూ.25 లక్షల చొప్పున నజరానా, వీరందరినీ ఒక చోటకు చేర్చిన ఆరిలోవకు చెందిన ఓ నేతకు ఒక ఫ్లాట్‌ను ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.

ఎన్నికలు వస్తున్నా హామీ నెరవేరదే?

పోలింగ్‌కు ఇంకా పక్షం రోజులు గడువున్నా ఎంవీవీ ఇచ్చిన హామీ నిలబెట్టు కోలేక పోవడంతో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ పది రోజులు దాటితే ఎంవీవీ ఇక తమకు దొరకడనే అభిప్రాయానికి వచ్చిన సొంత పార్టీ కార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కొందరు పార్టీ కార్య క్రమాలకు దూరంగా ఉంటూ నజరానా సంగతి తేల్చమని ఎంవీవీపై వత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ఎంవీవీ తన కార్యాలయంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్ల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్టు సమాచారం.

వాడీవేడిగా పంపకాల పంచాయితీ

వాడివేడిగా సాగిన సమావేశంలో సహనం కోల్పోయిన ఎంవీవీ ఆరిలోవకు చెందిన ఓ నాయకుడిపై చేయి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో భగ్గుమన్న నేతలు కార్యాచరణ రూపొందించుకునేందుకు వీలుగా నగరానికి దూరంగా పెందుర్తి సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలో కొందరు కార్పొరేటర్ల సమక్షంలో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఎంవీవీకి సహాయ నిరాకరణ చేసి ఓడించాలని తీర్మానించినట్టు తెలిసింది.

విషయం తెలుసుకున్న ఎంవీవీ కొందరు కార్పొరేటర్లను పిలిపించుకుని వారిని తీవ్ర స్థాయిలో బెదిరించారని ప్రచారం జరుగుతుంది. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి చర్యలు తీసుకుంటానంటూ ఎంవీవీ వీరిని బెదిరించినట్టు తెలిసింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్ భర్తపై ఎంవీవీ తీవ్ర పదజాలం ఉపయోగిస్తూ హెచ్చరించినట్టు వైసీపీ నేతలు బహిరంగంగానే చర్చించుకొంటున్నారు.

జరుగుతున్న పరిణామాలకు బలం చేకూరుస్తూ తమ ప్రమేయం లేకుండానే కొన్ని రోజులుగా ఎంవీవీ తన సొంత మనుషులను రంగంలోకి దింపి వార్డుల్లో నేరుగా ఓటర్లను కలుస్తూ వారికి నగదు, తాయిలాలను పంపిణీ చేస్తుండడం వీరికి రుచించడం లేదు.

క్యాడర్‌కు బదులు సొంత ఉద్యోగులు రంగంలోకి

పలువురు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు దూరంకావడంతో తన రియల్ ఎస్టేట్ కంపెనీలో, ఇతర సంస్థలతో పనిచేసే ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి దించి పంపిణీలు చేయిస్తున్నారు. ఇలా వచ్చిన ఉద్యోగులు ప్రతి పైసాకు లెక్క అడగడం, ఖర్చుకు ఆధారం చూపించమనడంతో కొత్త సమస్యలకు కారణమవుతుంది. ఎన్నికల సమయంలో కొంత ధనం వృథా అవుతుందని, అలా కాకుండా ప్రతి పైసాకు లెక్క కావాలంటే పనిచేయలేమని చెప్పి చోటా నేతలు, కార్యకర్తలు జారుకొంటున్నారు.

ఇలాగేనా వెలగపూడిని ఢీ కొనేదీ?

బలమైన ప్రత్యర్థి, మూడు పర్యాయాలు వరుసగా శాసనసభ్యుడిగా గెలిచిన తెలుగుదేశం ప్రత్యర్థి వెలగపూడి రామకృష్ణబాబును ఢీ కొనేది ఇలాగేనా అని వైసీపీ నేతలే ఎంవీవీ వైఖరిని తప్పుపడుతున్నారు. ముమ్మరంగా ప్రచారం చేయాల్సిన సమయంలో ఖర్చు లెక్కలు చూసుకొంటూ నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed