నిర్దోషిత్వానికి సంబంధించి నా వద్ద ఆధారాలు ఉన్నాయి: బ్రిజ్ భూషణ్ సింగ్

by Harish |
నిర్దోషిత్వానికి సంబంధించి నా వద్ద ఆధారాలు ఉన్నాయి: బ్రిజ్ భూషణ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టులో న్యాయమూర్తి ఆయన్ను, మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలకు సంబంధించి నేరాన్ని అంగీకరిస్తున్నారా అని అడిగినప్పుడు, దానికి సమాధానంగా, తాను నిర్దోషి అని, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేను ఏ తప్పు చేయనప్పుడు, నేరాన్ని చేసినట్లు ఎందుకు ఒప్పుకుంటాను? అని అన్నారు. అలాగే, నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని తగిన సమయం వచ్చినప్పుడు బయటపెడతానని కూడా తెలిపారు.

బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని లైంగిక వేధింపులు, మహిళపై బలప్రయోగం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. బ్రిజ్ భూషణ్‌ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది జనవరిలో అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ ఇంకా పలువురు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన కైసర్‌గంజ్ స్థానం నుండి అతనికి కాకుండా ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించింది.

Next Story

Most Viewed