తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందా?

by Dishafeatures2 |
తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య మెజారిటీతో గెలవడం తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబికింది. తాజా రిజల్టుతో తెలంగాణలోనూ తమ పార్టీ గెలుపు ఖాయమనే జోష్ శ్రేణుల్లో నెలకొన్నది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అంటూ చెప్పుకుంటున్న నేతలకు రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా మారాయి. సీనియర్-జూనియర్ తేడా లేకుండా సమిష్టి కృషితో పనిచేసినందువల్లనే విజయం సాధించామని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అదే స్ఫూర్తి తెలంగాణలో సాధ్యమవుతుందా అనే చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో మొదలైంది. టీ-కాంగ్ గ్రూపు తగాదాలు, వర్గ పోరు లాంటివన్నీ పక్కన పెట్టి కర్నాటక తరహాలోనే తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఒక్కటవుతారా అనేది కీలకంగా మారింది.

అన్ని స్థాయిల లీడర్లను ఒక్కటి చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తెలంగాణలో ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీని గెలిపించడానికి అన్ని వర్గాలను ఏకం చేయడం సాధ్యమేనా అనే సందేహం ఉన్నా ఆ చొరవ తీసుకునేదెవరనేది మింగుడుపడడంలేదు. అందరినీ కలుపుకుపోగలిగే నాయకులెవరన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక ప్రచారం చేయడం కలిసొచ్చిందని, ఈ విజయం వారికే అంకితమంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించగా, కాబోయే ప్రధాని రాహుల్‌గాంధీయే అంటూ మాజీ సీఎం సిద్ధరామయ్య కామెంట్ చేశారు. ఈ గెలుపు జాతీయ నాయకులదేననే అభిప్రాయాన్ని కర్నాటక కాంగ్రెస్ నేతలు పలువురు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేసులో పలువురు

‘నేనూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నాను..’ అని బహిరంగంగానే కామెంట్ చేసే కాంగ్రెస్ నేతలు తెలంగాణలో పదుల సంఖ్యలో ఉన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయడం సంగతి ఎలా ఉన్నా జిల్లాల్లో వారి డామినేషన్ దెబ్బతినకుండా గ్రూపులు మెయింటెయిన్ చేసే లీడర్లు ఎక్కువగానే ఉన్నారు. చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి.. ఇలా అనేక గ్రూపులు ఉన్నాయి. పార్టీలో ‘నేనే సీనియర్‌ని.. నాది కాంగ్రెస్ ఫ్యామిలీ.. ఇంకో పార్టీ నుంచి వచ్చి చేరినోడ్ని కాదు..’ ఇలాంటి కామెంట్స్ చాలా మంది వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రూపులు, వర్గాలు లేకుండా సమిష్టిగా పార్టీ కోసం పనిచేసేలా నేతలందరినీ ఒక్క తాటి మీదకు తేవడమే ఇప్పుడు జాతీయ నేతల కింకర్త్యవంగా కనిపిస్తున్నది.

ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందా?

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన టీ-కాంగ్ గతంలో వరంగల్ డిక్లరేషన్, ఇటీవల యూత్ డిక్లరేషన్ పేరుతో వివిధ సెక్షన్ల ప్రజలకు హామీలు ఇచ్చింది. కర్నాటకలో బీజేపీ ఓటమితో తెలంగాణలో ఆ పార్టీ ఎదుగుదలకు బ్రేకులు పడినట్లేనని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల నెలకొన్న వ్యతిరేకతను, అసంతృప్తిని ఏ మేరకు అనుకూలంగా మల్చుకుంటారన్నది కీలకంగా మారింది. కర్నాటక గెలుపుతో తెలంగాణలోని అన్ని స్థాయిల్లోని లీడర్లను కలుపుకుపోవడం ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డికి తక్షణావసరం. మెట్టు దిగేదెవరు, ఒకే గొడుకు కిందకు చేర్చేలా చొరవ తీసుకునేదెవరు?.. ఇవీ ఇప్పుడు కాంగ్రెస్‌ లో హాట్ టాపిక్.

Read More... CM కావాలని ఉన్నా బయటపెట్టను.. రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్



Next Story

Most Viewed